మధ్యప్రదేశ్ లో 150 సీట్లు గెలుస్తాం: రాహుల్ గాంధీ!
- మధ్యప్రదేశ్ లో కూడా ఘన విజయం సాధించబోతున్నామన్న రాహుల్
- ఈరోజు రాహుల్, ఖర్గేలతో భేటీ అయిన మధ్యప్రదేశ్ కీలక నేతలు
- రాష్ట్ర ప్రధాన సమస్యలపై చర్చించామన్న కమల్ నాథ్
త్వరలో జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి తాము అంతర్గత సమీక్ష నిర్వహించామని… కర్ణాటకలో 136 సీట్లు గెలిచామని, మధ్యప్రదేశ్ లో 150 సీట్లు గెలుస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్ కు చెందిన పార్టీ కీలక నేతలు ఈరోజు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ అయ్యాయి. భేటీ అయిన వారిలో మధ్యప్రదేశ్ పార్టీ చీఫ్ కమల్ నాథ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కమల్ నాథ్ మాట్లాడుతూ ఎన్నికలకు 4 నెలల సమయం మాత్రమే ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్ భవిష్యత్తు, ప్రధాన సమస్యలపై సమావేశంలో చర్చించామని తెలిపారు.
150 సీట్లు గెలుస్తామన్న రాహుల్ గాంధీ… పగటికలలు కనొద్దన్న మధ్యప్రదేశ్ సీఎం
మధ్యప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్… ఇతర రాష్ట్రాల్లోనూ అదే ఫలితాలు పునరావృతం అవుతాయని ధీమాతో ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై స్పందిస్తూ, 150 సీట్లు కచ్చితంగా గెలుస్తామని నమ్మకం వ్యక్తం చేశాడు.
రాహుల్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేతలు పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు ఊహా జగత్తులో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి 200కి పైగా సీట్లు రావడం ఖాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు.