తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి చాలా చూశా.. నోటీసులకు భయపడను: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్….
-
ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్టును తక్కువకే ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించానన్న రఘునందన్
-
తానెవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని వ్యాఖ్య
-
తమకు కోర్టు కేసులు, నోటీసులు కొత్త కాదని వెల్లడి
రోజుకు రూ.2 కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ టోల్ గేటు కాంట్రాక్టును రూ.66 లక్షలకు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించినందుకు తనకు నోటీసులు జారీ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి చాలా చూశానని చెప్పారు. ఈ రోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. తర్వాత ఆలయం బయట మీడియాతో మాట్లాడారు.
‘‘తెలంగాణ ఆస్తులకు నష్టం జరుగుతున్నప్పుడు.. ప్రజల గొంతుకగా మాట్లాడాను. నోటీసులిస్తేనో, కేసులు పెడితోనో ఎవ్వరూ భయపడరు. రోజుకు రూ.2 కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ టోల్ గేటు కాంట్రాక్టును రూ.66 లక్షలకు ఎందుకు కట్టబెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. అంతే తప్ప.. నేనెవరినీ వ్యక్తిగతంగా దూషించలేదు’’ అని అన్నారు.
‘‘తెలంగాణ ఉద్యమంలో పని చేసిన నాలాంటి వ్యక్తికి కోర్టులు, నోటీసులు కొత్త కాదు. ‘ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే’ అని ఆనాడే చెప్పిన వాళ్లం. ఐఆర్బీ సంస్థ నన్ను ఇబ్బంది పెట్టలేదు. కోర్టు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం’’ అని రఘునందన్ తెలిపారు.