కాంగ్రెస్ ఎన్నడూ సాకులు చెప్పలేదు.. నైతిక బాధ్యత వహించడానికి సిగ్గుపడలేదు: రాహుల్ గాంధీ…
-
మోదీ వెనుక అద్దంలో చూస్తూ ఇండియన్ కారును నడుపుతున్నారన్న రాహుల్
-
ఒడిశాలో రైలు ప్రమాదం ఎందుకు జరిగిందంటే.. గతంలో కాంగ్రెస్ చేసిందని చెబుతారని సెటైర్
-
ప్రధాని, బీజేపీ నేతలు గతాన్నే తవ్వుతారని, భవిష్యత్ ను ఆలోచించరని మండిపాటు
-
వారి వైఫల్యాలకు గతంలోని వ్యక్తుల్ని, ప్రభుత్వాలను నిందిస్తుంటారని విమర్శ
- కాంగ్రెస్ హయాంలో దుర్ఘటన జరిగితే నైతిక బాధ్యతగా రైల్వే మంత్రి రాజీనామా చేశారని వ్యాఖ్య
ప్రధాని మోదీ వెనుక అద్దంలో చూస్తూ భారతదేశం అనే కారును నడుపుతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ఎప్పుడూ గతం గురించి మాత్రమే మాట్లాడుతుందని, భవిష్యత్తు గురించి ఆలోచించదని చెప్పారు. భవిష్యత్ గురించి ఆలోచించే సామర్థ్యం బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు లేవని ఎద్దేవా చేశారు. ద్వేషాన్ని ద్వేషంతో తెంచలేమని, ప్రేమతో మాత్రమే నివారించగలమని చెప్పారు.
అమెరికా పర్యటలో ఉన్న రాహుల్ గాంధీ.. న్యూయార్క్‌లోని జవిట్స్ సెంటర్లో భారత సంతతి ప్రజలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ‘‘మీరు వారిని (బీజేపీ) ఏదైనా అడగండి. వారు వెనక్కి తిరిగి (గత ప్రభుత్వాలే కారణమని).. నిందలు వేస్తారు. ఒడిశాలో రైలు ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగితే.. 50 ఏళ్ల కిందట కాంగ్రెస్ చేసిందని చెబుతారు’’ అని మండిపడ్డారు. ఏం జరిగినా గత ప్రభుత్వాలను విమర్శించడమే బీజేపీ పని అని దుయ్యబట్టారు.