ములుగు జడ్పీ చైర్మన్ గుండెపోటుతో మృతి
-ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతి చెందారు. రోజు వారిగా శనివారం రాత్రి తన నివాసంలో నిద్రించగా, తెల్లవారుజామున గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో వరంగల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ములుగు జిల్లాలో విషాదం నెలకొంది.
సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి
అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి మృతి పట్ల సీఎం ఆవేదన చెందారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు.
తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీష్ పోషించిన చురుకైన పాత్రను, ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా జగదీష్ చేస్తున్న సేవలను సిఎం స్మరించుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.