జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ …రాహుల్ గాంధీ హాజరు…
పొంగులేటి చేరిక..భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు సభ వేదిక ఒక్కటే
జూలై 2న ఖమ్మంలో మల్లుభట్టి పాదయాత్ర ముగింపు సభ
రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ
అదే సభలో కాంగ్రెస్ లో చేరనున్న పొంగులేటి ఆయన అనుయాయులు …
కేసీఆర్ హటావో ,తెలంగాణకో బచావో పేరుతో ఖమ్మంలో జులై 2 వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వరంలో భారీ బహిరంగ సభ జరగనున్నది …దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు . ఇదే సభలో ఖమ్మం మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు . ఆయనతో పాటు మరికొందరికి రాహుల్ కాంగ్రెస్ కండలు కప్పనున్నారు . ఈసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి , రేణుకా చౌదరి , తదితరులు పాల్గొంటారు . ఇదే వేదికపై పీపుల్స్ మార్చ్ యాత్రను జయప్రదంగా చేసిన సీఎల్పీ నేత భట్టిని రాహుల్ గాంధీ సత్కరించనున్నారు .ఈ సభకు మూడు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఏర్పాట్లు వాయివేగంతో చేస్తున్నారు .
క్రెడిట్ ఎవరి ఖాతాలోకి … పొంగులేటిదా …? భట్టిదా …??
అయితే ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన సభపై అప్పడు చర్చలు ప్రారంభం అయ్యాయి. భారీ జనసమీకరణ చేయాలనీ లక్ష్యంతో కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. పొంగులేటి అభిమానులుసైతం ఈసభకు భారీ సంఖ్యలో హాజరు అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నారు . సభకు అటు పొంగులేటి ఇటు భట్టి అనుయాయులు కాంగ్రెస్ శ్రేణులు శ్రమిస్తున్నారు . అయితే జనసమీకరణలో ఎవరి వాటా ఎంత , క్రెడిట్ ఎవరికీ …దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. పొంగులేటి చేరిక , భట్టి పాదయాత్ర ముగుంపు సభ వేరు వేరుగా పెట్టి తమ సత్తా చాటాలని అనుకున్నారు .కానీ రెండు సభల ఒకే దగ్గర కొద్దీ రోజుల తేడాతో పెడితే బాగుండదని అధిష్టానం భావించి నేతలను ఒప్పించి సభ పెడుతున్నారు . దీనిపై రాజకీయ పార్టీల ద్రుష్టి కూడా పడింది . సభకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది. జనం ఎంతమంది వస్తారు .అనే చర్చ జరుగుతుంది. సభకు ప్రజలను రాకుండా అధికార బీఆర్ యస్ అడ్డుకుంటే అనే ప్రశ్నకు డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు సమాధానం ఇస్తూ రాహుల్ సభకు, ప్రజలను ఆపడం ఎవరి తరం కాదని అన్నారు .ఈసారి కాంగ్రెస్ ను గెలిపించడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు .
ఠాక్రే ఏమన్నారంటే ….
కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఖమ్మంలో జూలై 2న జరగనుందని, ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. మార్చి 16న అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుండి భట్టి పాదయాత్ర ప్రారంభమైంది. 105 రోజుల్లో 36 నియోజకవర్గాలను, 600కు పైగా గ్రామాలలో పర్యటించారు. మొత్తం 1,221 కిలో మీటర్ల మేర ఈ యాత్ర సాగినట్లు వెల్లడించారు. మూడు రోజుల్లో పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో ఖమ్మంలో జూలై 2న తెలంగాణ జనగర్జన సభ ఏప్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. రెండు లక్షల మందితో ఈ సభను నిర్వహిస్తామని తెలిపారు.
పీపుల్స్ మార్చ్ ను విజయవంతంగా ముగించిన భట్టిని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అదే సభలో ఘనంగా సత్కరిస్తారన్నారు. ఆ సమయంలోనే పొంగులేటి పార్టీలో చేరుతారన్నారు. మల్లుభట్టి పాదయాత్ర విజయవంతమైందని, ప్రజల నుండి మంచి స్పందన వచ్చినట్లు మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. మల్లుభట్టికి స్వాగతం పలికే వారిలో పొంగులేటి కూడా ఉంటారన్నారు. కాగా, ఖమ్మం జిల్లాలో నిర్వహించే బహిరంగ సభపై ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ పొంగులేటిలు సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరు చర్చించారు.