Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర.. ఇంతింతై వటుడింతై అన్నట్టు పరిస్థితి ఉంది: కేసీఆర్

  • ఎకరం రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ ప్రగతికి దర్పణం పడుతోందన్న కేసీఆర్
  • దీన్ని ఆర్థిక కోణంలోనే కాకుండా ప్రగతి కోణంలో కూడా విశ్లేషించాలన్న సీఎం
  • తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమిదని వ్యాఖ్య

హైదరాబాద్ లో భూముల ధరలు కనీవినీ ఎరుగని స్థాయికి పెరుగుతున్నాయి. కోకాపేటలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిన్న జరిగిన భూముల ఈవేలం ప్రక్రియలో ఎకరా రూ. 100.75 కోట్లకు అమ్ముడుపోవడం సంచలనం రేపుతోంది. ఈ వేలం ప్రక్రియలో దేశంలోని దిగ్గజ కంపెనీలు పోటీపడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  

ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని కేసీఆర్ అన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములను కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న తీరు వర్తమాన పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు.  

తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి, హైదరాబాద్ ఆత్మ గౌరవాన్ని కించ పరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎవరెంత నష్టం చేయాలని చూసినా ధృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, హైదరాబాద్ వంటి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమిది అన్నారు. 

హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హెచ్ఎండీఏ అధికారులను, మంత్రి కేటీఆర్ ను, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ను అభినందిస్తున్నానని కేసీఆర్ చెప్పారు.

Related posts

రూ.10 వేలు ఎర వేసి కోట్లు కొల్లగొట్టారు!

Ram Narayana

 బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్

Ram Narayana

చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులతో.. తెలంగాణ తల్లి రూపం ఇదే!

Ram Narayana

Leave a Comment