- రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అగౌరవపరిచేలా ఉన్నాయన్న హరీశ్ సాల్వే
- రాహుల్ నియోజకవర్గంలో ఆందోళనల కారణంగానే స్టే విధించారని వ్యాఖ్య
- రాహుల్ పై నిషేధం ఉంటే పార్లమెంటులో ఆయన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఉండదన్న సాల్వే
మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికావని మాజీ సొలిసిటర్ జనరల్, న్యాయ నిపుణులు హరీశ్ సాల్వే అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు ఇవి కావని వ్యాఖ్యానించారు. ఈ కేసులో రాహుల్ కు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై ఆయన స్పందిస్తూ… కేసులోని మెరిట్స్ ఆధారంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోలేదని… రాహుల్ నియోజకవర్గంలోని ఆందోళనల కారణంగా నిర్ణయం తీసుకుందని అన్నారు.
రాహుల్ కు శిక్ష పడుతుందా? పడదా? అనేది వేరే విషయమని… దేశ ప్రధాని కావాలని భావిస్తున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవి కావని సాల్వే చెప్పారు. రాహుల్ స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. రాహుల్ మాటలు సరికాదని సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చెప్పారని, ప్రజా జీవితంలో ఉన్నవారు సరైన పద్ధతిలో మాట్లాడాలని సూచించారని గుర్తు చేశారు.
రాహుల్ ఎంపీ సభ్యత్వంపై నిషేధం ఉంటే… ఆయన నియోజవర్గానికి (వయనాడ్) పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉండదని… అందుకే ఆయన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిందని చెప్పారు. కేసులో మెరిట్స్ కు, స్టే ఎత్తివేయడానికి సంబంధం లేదని అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాల్వే ఈ మేరకు తన అభిప్రాయాలను వెల్లడించారు.
కర్ణాటకలో ఓ సభలో రాహుల్ మాట్లాడుతూ… దేశంలోని దొంగలందరికీ ఇంటి పేరు మోదీ అనే ఎందుకుందని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, రాహుల్ పై గుజరాత్ మంత్రి పూర్ణేశ్ మోదీ కేసు వేశారు.