- హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు బదిలీ
- రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా తమీషా అనే మహిళతో పరిచయం
- న్యూడ్‌కాల్స్ చేసుకోవడంతోపాటు హైదరాబాద్‌లో రహస్యంగా కలుసుకున్న వైనం
విశాఖపట్టణంలోని ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పాకిస్థాన్ హనీట్రాప్‌లో చిక్కి విలవిల్లాడుతున్నాడు. గుజరాత్‌కు చెందిన కపిల్ కుమార్ నిరుడు ఆగస్టు 22న హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు బదిలీ అయ్యాడు. ఫైర్ విభాగంలో పనిచేస్తున్న ఆయనకు రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా తమీషా అనే మహిళ పరిచయమైంది. ఆ పరిచయం మరింత పెరిగి న్యూడ్ వీడియో కాల్స్ చేసుకునేంత వరకు వెళ్లింది. ఆ తర్వాత వీరిద్దరూ హైదరాబాద్‌లోని భానూరులో ఓ గదిలో రహస్యంగా కలుసుకున్నారు.
తమీషా ఓ ఉగ్రవాద సంస్థ ముఖ్య నాయకుడి వద్ద పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కపిల్ కుమార్ నుంచి భారత్ డైనమిక్స్, స్టీల్‌ప్లాంట్‌కు చెందిన రహస్య సమాచారాన్ని ఆమె రెండేళ్లుగా అతడి నుంచి సేకరిస్తున్నట్టు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఒక నంబరు నుంచి తరచూ పాకిస్థాన్‌కు కాల్స్ వెళ్తున్నట్టు పసిగట్టిన నిఘా సంస్థలు విషయాన్ని పోలీసులకు చేరవేశాయి. వారు కపిల్ కుమార్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన వద్ద నుంచి మొత్తం మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.