- ఢిల్లీలో వెలుగు చూసిన దారుణం
- మధ్యవర్తికి రూ.70 వేలు ఇచ్చి ఇంటికి తెచ్చుకున్న మహిళతో వ్యక్తి వివాహం
- తరచూ ఇంట్లోంచి వెళ్లిపోతూ నెలల తరువాత ఇంటికి తిరగొచ్చే మహిళ
- భార్య ఎక్కడికి వెళ్లేదో? ఏం చేసేదో? తెలీక భర్తకు ఇబ్బందులు
- చివరకు బంధువుల సాయంతో మహిళను హత్య చేసిన భర్త
ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మధ్యవర్తికి రూ.70 వేలు ఇచ్చి ఊరూపేరులేని ఓ మహిళను పెళ్లాడిన వ్యక్తి భార్య తీరు నచ్చలేదంటూ ఆమెను హత్య చేశాడు. ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ కేసులో మృతురాలి భర్త ధరమ్‌వీర్‌తో పాటూ అరుణ్, సత్యవన్ అనే మరో ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, ఫతేపూర్ బేరీలోని ఝీల్‌ఖుర్డ్ సరిహద్దు వద్ద ఉన్న అడవిలో శనివారం పోలీసులు ఓ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా జరిగిన దర్యాప్తులో తొలుత అరుణ్ అనే ఆటోడ్రైవర్ పోలీసులకు చిక్కాడు. విచారణలో అతడు మృతురాలి పేరు స్వీటీ అని, ఆమె తన బంధువు ధరమ్‌వీర్ భార్య అని తెలిపాడు. మరో బంధువు సత్యవన్‌తో కలిసి ఆమెను తాము హత్య చేశామని చెప్పాడు. హర్యానా సరిహద్దు వద్ద ఆమెను చంపి ఇక్కడి అడవిలో పడేశామని తెలిపాడు.
స్వీటీ తరచూ ఇంట్లోంచి వెళ్లిపోయేదని, నెలల పాటు కనిపించకుండా పోయి ఆ తరువాత తిరిగొచ్చేదని అతడు చెప్పాడు. భార్య తీరుతో ధరమ్‌వీర్ విసిగిపోయాడని పేరొన్నాడు. స్వీటీ తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యం గురించి ఎవరకీ తెలీదని కూడా చెప్పాడు. ఓ మహిళకు ధరమ్‌వీర్ రూ.70 వేలు ఇచ్చి స్వీటీని ఇంటికి తెచ్చుకుని పెళ్లాడాడని అన్నాడు. తాను బీహార్‌లోని పాట్నా అని మాత్రం స్వీటీ చెప్పేదని అన్నాడు.
భార్య తీరుతో విసిగిపోయిన ధర్‌మ్‌వీర్ తమ సాయంతో ఆమెను అడ్డుతొలగించున్నాడని చెప్పాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వీటీ భర్తను వదిలి తరచూ ఎక్కడికి వెళ్లేది? ఆమె కుటుంబం నేపథ్యం ఏంటో తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.