ప్రస్తుతం దేశంలో ఆందోళనకర పరిస్థితులు ….ప్రకాష్ రాజ్ .
- మణిపూర్ మండిపోతుంటే పార్లమెంటులో సమస్య పరిష్కారంపై మాట్లాడలేదని విమర్శ
- జోకర్‌ను నాయకుడిగా చేస్తే మనం చూసేది ఇలాంటి సర్కస్ మాత్రమేనని వ్యాఖ్య
- మౌనంగా ఉంటే దేశానికి తగిలిన గాయాలు రాచపుండులా మారుతాయని హెచ్చరిక
వంద రోజులుగా మణిపూర్ మండిపోతుంటే పార్లమెంటులో ఎంపీలు నువ్వా.. నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారంపై మాట్లాడలేదని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆవిర్భావ సదస్సులో ఆయన మాట్లాడుతూ… జోకర్‌ను నాయకుడిని చేస్తే మనం చూసేది ఇలాంటి సర్కస్ మాత్రమే అన్నారు. మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ దేశానికి తగిలిన గాయాలు రాచపుండులా మారుతాయన్నారు. ప్రస్తుతం మనం, మన దేశం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామన్నారు.
సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ తాను ఊరికే కూర్చోలేనన్నారు. లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం రచయితలందరూ సంఘటితమైనదే ఈ సమూహ ఫోరమ్ అన్నారు. ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచయితలందరి ఉమ్మడి స్వరమన్నారు. సహనశీలతను పాటిస్తూ మతోన్మాదాన్ని ధిక్కరించే సాహిత్యకారులు, సాంస్కృతిక కార్యకర్తల ఉమ్మడి వేదిక ఇది అన్నారు.