ఖమ్మం రాజకీయాల్లో నేతల ఉక్కిరి బిక్కిరి …అమిత్ షా సభకు లక్ష్యం లక్ష …!
తుమ్మల రాజకీయ అడుగులపై ఉత్కంఠ
ఖమ్మం పరిణామాలపై కలత చెందిన కేసీఆర్..జిల్లా నేతలతో అత్యవసర భేటీ ..
తుమ్మల ఏ పార్టీలో చేరేది ఆయన ఇష్టమన్నగరికపాటి
వామపక్ష రాజకీయాలకు నిలయం …ఉద్యమాల గుమ్మం ఖమ్మపై బీజేపీ ఫోకస్ పెట్టింది…రెండు పర్యాయాలు వాయిదా పడ్డ బీజేపీ అగ్రనేత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభ ఆదివారం జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఖమ్మం పై కేంద్రీకరించారు . బీజేపీకి పెద్దగా ఉనికి లేని ఖమ్మంను ఎంచుకొని సభ పెట్టడం అందుకు వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ఇతర నాయకులూ రావడం వారు గ్రామాలూ మండలాలు తిరిగి ప్రచారం చేయడం కొత్త పరిణామం …ప్రత్యేకంగా వారు ఎస్సీ , ఎస్టీ నియోజకవర్గాలపై కేంద్రీకరించారు . అమిత్ షా సభకు లక్షమంది ప్రజల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు .ఖమ్మంలో అంతమందిని బీజేపీ సమీకరిస్తుందా అనేది ఆసక్తిగా మారింది.
మరో పక్క బీఆర్ యస్ కీలక నేత మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు టికెట్ నిరాకరించడంతో ఆయన తిరుగుబాటు జెండా ఎగురవేశారు . ఇప్పటికే టిక్కెట్ల కేటాయింపులో తమకు జరిగిన అన్యాయాలపై రాష్ట్ర వ్యాపితంగా ధిక్కార స్వరాలు వినిపిస్తుండగా , తుమ్మల నాగేశ్వరరావు హైద్రాబాద్ టు ఖమ్మం కు పెద్ద కార్ల ర్యాలీని తీసి బీఆర్ యస్ పార్టీకి సవాల్ విసిరారు …తాను కార్యకర్తల అభీష్టం మేరకు పోటీలో ఉంటానని సభికుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు . ఆయన రాజకీయ అడుగులు ఎటు అనేది ఉత్కంఠంగా మారింది…దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేసీఆర్ ఖమ్మం నేతలను ఉన్నపళంగా అత్యవసర భేటీ కోసం హైద్రాబాద్ రమ్మన్నారు .. మరో పక్క కాంగ్రెస్ లో టికెట్స్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య భారీగా ఉండటం పార్టీలో ఒకరకంగా ప్లస్ మరోరకంగా మైనస్ గా మారింది…
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్త చూపు ఖమ్మం పై పడనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని ఎస్.ఆర్. అండ్ బి . జి.ఎన్ .ఆర్. కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రైతు గోస- బీజేపీ భరోసా పేరిట ఈ సభ ఏర్పాటు చేశారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా మూడో సారి సభ కోసం ఏర్పాట్లు చేశారు. లక్ష మంది జన సమీకరణ చేపట్టినట్టు పార్టీ నాయకులు తెలిపారు. కేంద్ర భద్రత సిబ్బంది శనివారం హెలికాఫ్టర్ లో ఖమ్మం చేరుకొని అమిత్ షా భద్రత , సభ బందోబస్తు రూట్ మ్యాప్ పరిశీలించారు. ఖమ్మం , భద్రాద్రి కలెక్టర్లు , పోలీస్ కమిషనర్ తో భేటీ అయ్యారు. ప్రోటోకాల్ పై చర్చించారు. దాదాపుగా కేంద్ర బలగాలు షా పర్యటన మొత్తంగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సమయ భావం వల్ల చివరి నిమిషంలో భద్రాచలం పర్యటన రద్దయిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ లోకి తుమ్మల? మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాలేరు అసెంబ్లీ కు పోటీ చేస్తారని ప్రకటించారు. బి.ఆర్.ఎస్. టికెట్ ఇవ్వకపోవడంతో ఆయనతో సహా అనుచరులు గుర్రుగా ఉన్నారు. 40 ఏళ్ల తుమ్మల రాజకీయ జీవితంలో శుక్రవారం ఖమ్మంలో కార్యాకర్తలను ఉద్దేశించి ఇంతలా ఉద్వేగంగా మాట్లాడింది లేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బి.ఆర్.ఎస్.లో చేరిన నాటి నుంచి తుమ్మల X కందాల గా మారింది. తన వర్గీయులపై కేసులు నమోదు చేసి జైలు కు పంపించిన, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఏనాడూ పార్టీ, అగ్ర నేతలను తుమ్మల ఒక్క మాట అనలేదు. అందరిలాగానే పోలీస్ ఉన్నత స్థాయి అధికారులను కలసి ఫిర్యాదు చేశారు. దానవాయిగూడెం జైలు కు వెళ్లి నాయకులకు భరోసా అండగా ఉంటానని చెప్పారు. ఆయన వ్యూహాత్మక మౌనాన్ని గులాబీ వర్గాలు అర్ధం చేసుకోకపోగా టికెట్ నిరాకరించడంతో కారు (పార్టీ) దిగాలని నిర్ణయించుకొని పాలేరు అసెంబ్లీ పోటీ కి సై అన్నారని తుమ్మల వర్గీయులు పేర్కొంటున్నారు. టీడీపీ లో ఉండగా ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తో తుమ్మలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ఫోన్ కాల్ లో తుమ్మలతో మాట్లాడినట్లు కాంగ్రెస్ ముఖ్యులు తెలియజేస్తున్నారు. మరో వైపు అనుచరులు, అభిమానులు కూడా కాంగ్రెస్ లో చేరాలని తుమ్మలపై ఒత్తిడి చేస్తున్నారు. పార్టీ మార్పు అంశంపై తుమ్మల వియ్యంకుడు, బీజేపీ నేత, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు స్పందించారు. ఖమ్మం అమిత్ షా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆయన ఈ అంశంపై మాట్లాడారు. తుమ్మలతో ఉన్నది బంధుత్వమని తేల్చి చెప్పారు. రాజకీయాలకు సoబందం లేదన్నారు. ఏ పార్టీలో చేరాలనేది ఆయన ఇష్టమన్నారు. తాము జోక్యం చేసుకోమన్నారు.
కేసీఆర్ పిలుపు తో : తుమ్మల పోటీ ప్రకటన తో గులాబీ బాస్ కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం పై ఫోకస్ పెంచారు. శనివారం సాయంత్రం ఉమ్మడి ఖమ్మం లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను పిలిచి మాట్లాడారు.