అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది… అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను: చంద్రబాబు
- బనగానపల్లెలో ప్రజా వేదిక కార్యక్రమం
- మహిళలతో చంద్రబాబు ముఖాముఖి
- ఇప్పటికీ అలుపెరగకుండా ఎలా పనిచేస్తుంటారని ప్రశ్నించిన మహిళ
- రెండు పాయింట్లతో తన ఆరోగ్యం గురించి వివరించిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో మహిళలతో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మహిళ చంద్రబాబును ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది.
“సార్… మిమ్మల్ని మేం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పటికీ అలాగే ఉత్సాహంగా ఉన్నారు. నేటికీ మీరు అలుపెరగకుండా పనిచేస్తుంటారు. ఇది ఎలా సాధ్యం?” అంటూ ప్రశ్నించింది.
అందుకు చంద్రబాబు స్పందిస్తూ, “నా ఆరోగ్య రహస్యం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు?” అని తిరిగి ఆ మహిళను ప్రశ్నించారు. “మీరే చెప్పాలి సార్” అంటూ ఆ మహిళ పేర్కొంది. దాంతో చంద్రబాబు తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు.
“మొదటిది… మనం చేసే పనిలో ఆనందం పొందాలి. నేను ప్రజల కోసం పనిచేస్తాను. అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రజల కోసం పనిచేస్తున్నామన్న ఆనందంతో ఉత్సాహం రెట్టింపవుతుంది, ఎనర్జీ లెవల్స్ పెరుగుతూనే ఉంటాయి. అందుకే నేను ఉదయం నుంచి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటాను.
రాత్రివేళ నిద్ర పోవాలి కాబట్టి నిద్ర పోతాను తప్ప నాకు అలసట అనేది ఉండదు. నిద్రపోవడం వల్ల బ్యాటరీ మాదిరిగా రీచార్జ్ అవుతాను.
ఇక రెండోది… తినే తిండి… ఇది కూడా చాలా ముఖ్యమైనది. మనందరం భోంచేస్తుంటాం. అయితే ఆ తినే ఆహారం పోషక విలువలతో కూడుకున్నదై ఉండాలి. అది కూడా సమతుల ఆహారం తీసుకోవాలి. అప్పుడే శరీరానికి తగిన శక్తి అందుతుంది… మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.
మన శరీరానికి కావాల్సింది… పౌష్టికాహారం. మితంగా కార్బోహైడ్రేట్లు కావాలి… ప్రొటీన్లు కావాలి, విటమిన్లు కావాలి… వీటితో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరమే. వీటన్నింటిని తగు మోతాదులో శరీరానికి అందేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు.
మీరు బాగా నిద్రపోయారా, ఏం తిన్నారు? అనే అంశాలను ఇవాళ సెన్సర్ల సాయంతో తెలుసుకోగలుగుతున్నాం. నేను ఒకటే చెబుతాను… సెల్ ఫోన్ ను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అదే మీ ఆరోగ్య పరిరక్షణ సాధనం అవుతుంది” అని చంద్రబాబు వివరించారు.