- బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఇద్దరు సభ్యులు ఓటు
- ఎలక్ట్రానిక్ విధానంలో సాంకేతిక సమస్య
- స్లిప్పులు పంచి ఓటింగ్ నిర్వహణ
మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు, వ్యతిరేకంగా 2 ఓట్ల వచ్చాయి. నిన్న దిగువ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై ఈ రోజు సుదీర్ఘంగా 8 గంటల పాటు చర్చ సాగింది. బిల్లుపై 60 మంది సభ్యులు మాట్లాడారు. చివరలో అమిత్ షా బిల్లుపై సమాధానం ఇచ్చారు. కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లును తొలుత ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ద్వారా ఆమోదించాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా ఆ తర్వాత సభ్యులకు స్లిప్పులు ఇచ్చారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులు ఇచ్చి ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో 456 మంది సభ్యులు ఉన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు చట్టసభల్లో (పార్లమెంట్, అసెంబ్లీ) 33 శాతం సీట్లు దక్కుతాయి. అయితే 2024 ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలు కాదు. 2029 ఎన్నికల్లో అమలు కానుంది.
అసదుద్దీన్ సహా… మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎంపీలు వీరే!
- ఓటింగ్ సమయంలో లోక్ సభలో 456 మంది ఎంపీలు
- బిల్లును వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీ ఎంపీలు
- వ్యతిరేకంగా ఓటేసిన వారిలో ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ కూడా
దశాబ్దాలుగా వేచి చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు బుధవారం సాయంత్రం లోక్ సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో 456 మంది ఎంపీలు ఉండగా, 454 మంది బిల్లుకు అనుకూలంగా, ఇద్దరు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినవారిలో తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన మజ్లిస్ పార్టీ ఎంపీలు ఉన్నారు
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఇదే పార్టీకి చెందిన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకంగా ఓటు వేశారు. 2019లో మజ్లిస్ పార్టీ మహారాష్ట్రలో ఒక స్థానాన్నిగెలుచుకుంది. ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.