- కల్వకుర్తి టికెట్ ఆశించి భంగపడిన కసిరెడ్డి
- నిన్న తన నివాసంలో కల్వకుర్తి నేతలతో మంతనాలు
- కసిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి టికెట్ ఆఫర్ చేసినట్టు ప్రచారం
అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి వరస దెబ్బలు తగలుతుండగా, కాంగ్రెస్ రోజురోజుకు పుంజుకుంటోంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలు పలువురు కాంగ్రెస్‌లో చేరగా, ఇప్పుడు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. బ్రిలియంట్ విద్యా సంస్థల అధినేత అయిన కసిరెడ్డి బీఆర్ఎస్‌కు బైబై చెప్పేసి ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
నాగర్‌కర్నూలు జిల్లా కల్వకర్తి నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన కసిరెడ్డికి నిరాశే ఎదురైంది. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కే కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ఆయనకు కల్వకుర్తి టికెట్ ఆఫర్ చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. నిన్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలతో భేటీ కావడం ఈ వార్తలకు ఊతమిస్తోంది.