- సొంత రాష్ట్రంలోనే బీజేపీని నడ్డా గెలిపించుకోలేక పోయారన్న హరీశ్
- బీజేపీ చేరికల కమిటీ ఫ్లాప్ అయిందని ఎద్దేవా
- తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోనే బీజేపీని నడ్డా గెలిపించుకోలేకపోయారని… తెలంగాణలో ఆయన సాధించేది ఏముందని ప్రశ్నించారు. నడ్డా… ఇది కేసీఆర్ అడ్డా అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ తీసుకొచ్చిన చేరికల కమిటీ అట్టర్ ఫ్లాప్ అయిందని… ఆ పార్టీలో ఎవరూ చేరలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకోవాలని అన్నారు.
తెలంగాణలో హంగ్ వస్తుందని బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందిస్తూ… తెలంగాణలో వచ్చేది హంగ్ కాదని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బీజేపీని సంతోష్ బ్రష్టు పట్టించారని అన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పై కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే, మూటలు, మాటలు, మంటలు అని విమర్శించారు. సీఎం పదవి కోసం మతం మంటలు రేపిన చరిత్ర కాంగ్రెస్ దని అన్నారు. నక్సలైట్లను చర్చలకు పిలిచి, వారిని మట్టుపెట్టింది కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.