- డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలన్న బీఆర్ఎస్ నేత
- సంక్షేమ పథకాలు అర్హులు అందరికీ చేరాలని వ్యాఖ్య
- హనుమకొండలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి హాజరు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరాలని బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం అభ్యర్థి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ క్రమంలో దళిత బంధు, గృహలక్ష్మి వంటి పథకాలు రావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని కొంతమంది మద్యవర్తులు లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. అయితే, ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ పథకానికి కూడా రూపాయి లంచం ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఎవరన్నా డబ్బులు అడిగితే తనకు చెప్పాలని కార్యకర్తలకు సూచించారు.
సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు వసూలు చేస్తే వారి బట్టలు ఊడదీయిస్తానని హెచ్చరించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కడియం శ్రీహరి.. మీటింగ్ లో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే స్టేషన్ ఘన్‌పూర్‌ను నెం.1గా తీర్చిదిద్దుతానని కడియం శ్రీహరి కార్యకర్తలకు హామీ ఇచ్చారు.