మాకూ టిక్కెట్లు ఇవ్వండి…మాకు టికెట్స్ ఇవ్వండి అని డిమాండ్ ..
- కమ్మ నాయకులు అంటే పార్టీకి అంత లోకువా? అని రేణుకా చౌదరి నిలదీత
- పిల్లికి భిక్షం వేసినట్లు నాలుగు బిస్కెట్లు వేస్తే ఎలా? అని ప్రశ్న
- ఇతర పార్టీలు చేసినట్లు కాంగ్రెస్ ఎందుకు చేయడం లేదని నిలదీత
కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపుపై ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టిక్కెట్ల కేటాయింపుపై పార్టీలోని కమ్మ నాయకులు తీవ్ర ఆవేదనతో ఉన్నారన్నారు. కమ్మ నాయకులు అంటే పార్టీకి అంత లోకువ ఉందా? అని నిలదీశారు. తక్కువగా అంచనా వేయవద్దని హితవు పలికారు. ఏదో పిల్లికి భిక్షం వేసినట్లు నాలుగు బిస్కెట్లు వేస్తే ఎలా? అన్నారు. తమ వారికి సీట్లు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కూడా చూసుకుంటామని ఇతర పార్టీలు ఆహ్వానిస్తున్నాయన్నారు. అలా కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోతోందన్నారు.
పార్టీ టిక్కెట్ల కేటాయింపులలో సామాజిక న్యాయం జరగలేదన్నారు. బయటి నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. డబ్బున్నవారి కంటే దమ్మున్నోళ్లకు టిక్కెట్లు ఇవ్వాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై కమ్మ వర్గం ఆగ్రహంగా ఉందన్నారు. వారి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.