- రేవంత్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కాబోతున్నాడంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు
- రేవంత్ ముఖ్యమంత్రి కావాలంటే అన్ని సీట్లు గెలవాలని వ్యాఖ్య
- వైఎస్ ఆత్మ రేవంత్ రెడ్డి శరీరంలోకి వచ్చిందని వ్యాఖ్య
తాండూరులో కాంగ్రెస్ పార్టీ విజయభేరి యాత్రలో పలువురు నాయకుల ప్రసంగాలు ‘రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి’ అంటూ సాగాయి. ఈ విజయభేరి సభలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటూ ప్రసంగాలు చేశారు. రేవంత్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని, ముఖ్యమంత్రి కాబోతున్నాడని, మన పక్కనే ఉండే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నాడంటూ ప్రసంగాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు హామీలపై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మొదటి సంతకం చేస్తారంటూ కూడా నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ నేత ప్రసాద్ మాట్లాడుతూ… రేవంత్ ముఖ్యమంత్రి కావాలంటే వికారాబాద్ జిల్లాలోని నాలుగుకు నాలుగు సీట్లు కాంగ్రెస్ గెలవాలన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఆయన ఆత్మ రేవంత్ శరీరంలోకి వచ్చారని, అప్పుడు ఆయన ఇందిరమ్మ పాలన తెచ్చారని, ఇప్పుడు రేవంత్ మరోసారి తెస్తున్నారన్నారు.