చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అద్భుతాలు బయటికి వచ్చాయి
- హైదరాబాదులో గతరాత్రి సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్
- ఈ కార్యక్రమం అందరి మనసులు తడిమిందన్న నారా భువనేశ్వరి
- తెలుగు ప్రజల హృదయాలను కదిలించిందని వెల్లడి
హైదరాబాదులో గత రాత్రి జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ తెలుగు ప్రజల హృదయాలను కదిలించిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమం అందరి మనసులను తడిమిందని పేర్కొన్నారు.
ఒక నేత పాలనలో, పాలసీలతో లబ్దిపొందిన వర్గాలు ఇలా కృతజ్ఞత తెలిపేందుకు వేలాదిగా తరలి రావడం నేటి రాజకీయాల్లో అత్యంత అరుదైన విషయం అని భువనేశ్వరి వివరించారు. ఒక నాయకుడిగా చంద్రబాబు గారికి ఇంతకంటే ఇంకేం కావాలని పేర్కొన్నారు.
“ఎవరినైనా అరెస్ట్ చేస్తే వారి అక్రమాలు బయటికి వస్తాయి. కానీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అద్భుతాలు బయటికి వచ్చాయి” అని వివరించారు. చంద్రబాబు గారిని జైల్లో పెట్టాం అని కొందరు ఆనందపడుతున్నారు… కానీ ఆయన కోట్ల మంది హృదయాల్లో ఉన్నారని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. వెలకట్టలేని మీ కృతజ్ఞతలకు అభివందనాలు అంటూ ఆమె సోషల్ మీడియాలో స్పందించారు.