Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ వాక్బాణాలు…ఆపార్టీలో వాడవాడకు ముఖ్యమంత్రులే అని ఎద్దేవా !

కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ వాక్బాణాలు…ఆపార్టీలో వాడవాడకు ముఖ్యమంత్రులే అని ఎద్దేవా !
కాంగ్రెస్ పార్టీలో వాడవాడకు ముఖ్యమంత్రులే ఉంటారు: కేసీఆర్ ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీలో డజను మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దేవా
కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు కానీ… ముఖ్యమంత్రులని మాట్లాడుతారని వ్యాఖ్య
అభ్యర్థులతో పాటు పార్టీల నైజం తెలుసుకోవాలన్న కేసీఆర్
పంజాబ్ తర్వాత వ్యవసాయంలో మనం రెండో స్థానంలో ఉన్నామన్న కేసీఆర్

కాంగ్రెస్ పార్టీలో వాడవాడకు ముఖ్యమంత్రులే ఉంటారని, నన్ను గెలిపించండి… నేను ముఖ్యమంత్రిని అవుతానని ఆ పార్టీలో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. హుజూర్ నగర్ ప్రజా ఆశీర్వాద సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో డ‌జ‌న్ మంది ముఖ్య‌మంత్రులు ఉన్నార‌న్నారు. అసలు ఆ పార్టీ గెలిచే పరిస్థితే లేదని, కానీ అందరూ తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారన్నారు. ఒక్క హుజుర్‌న‌గ‌ర్‌లోనే కాదు.. దేశ‌మంతా కాంగ్రెస్ పార్టీది అదే ప‌రిస్థితి అన్నారు. తాను సీఎం అవుతానని ఒకరు… బుడ్డరఖాన్ అవుతానని ఇంకొకరు… నేను ఇది అవుతా… అది అవుతానంటూ గోల్ మాల్ చేసి ఓట్లు అడుగుతున్నారన్నారు. పార్టీల తరఫున నిలబడే వ్యక్తులతో పాటు పార్టీల నైజం, దృక్పథం తెలుసుకోవాలన్నారు.

రైతుబంధు అనే పథకాన్ని ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్ అన్నారు. రైతుల కోసం ఖర్చు చేస్తుంటే విపక్షాలు మాత్రం ప్రజల పన్నులను దుబారా చేస్తున్నాయని విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. పంజాబ్ తర్వాత వ్యవసాయంలో మనం రెండో స్థానంలో ఉన్నామన్నారు. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నట్లు చెప్పారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకున్నామన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో సాగునీరు, మంచినీళ్ల‌ కోసం అనేక క‌ష్టాలు పడ్డామని, ఇవాళ అన్ని స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించుకున్నామన్నారు.

గిరిజ‌న తండాలను గ్రామ‌పంచాయ‌తీలుగా తీర్చిదిద్దుకున్నామని, వారి హ‌క్కుల‌ను కాపాడామన్నారు. ఇవాళ మేజ‌ర్‌గా కృష్ణా న‌దిలో నీళ్లు రాలేదని, శ్రీశైలం దాకా నిండిందని, సాగ‌ర్ దాకా నీళ్లు రాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఫోన్ చేసి… పంట‌లు పాడు అవుతున్నాయి… ప‌ది ప‌న్నెండు రోజులు నీళ్లు వ‌ద‌లాలని కోరితే అధికారుల‌ను పిలిచి మాట్లాడి నీళ్ల‌ను వదిలామన్నారు. హుజుర్‌న‌గ‌ర్‌కు వారం ప‌ది రోజుల పాటు మ‌ళ్లీ నీళ్లు పంపిస్తామని, ఆందోళన అవసరం లేదన్నారు.

ఈ దేశం మీది… ఈ రాష్ట్రం మీది…: యువతకు కేసీఆర్ పిలుపు

యువతా ఈ దేశం మీది.. ఈ రాష్ట్రం మీది.. భవిష్యత్ మీది… ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఏకైక ఆయుధం ఓటు… ఆలోచించి ఓటెయ్యండి… అభివృద్ధికి అండగా నిలబడండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్ర మలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును అందరూ గమనించాలన్నారు. 1956లో తెలంగాణ కాంగ్రెస్ చిన్న పొరపాటు కారణంగా 56 ఏళ్ల పాటు తెలంగాణ ఏడ్చిందన్నారు. కరెంటు లేదు… మంచినీళ్లు లేవు… ప్రాజెక్టులు పూర్తి కాలేదు.. ఉద్యోగాలు లేవు… నిధులు రాలేదన్నారు. మళ్లీ 2001లో ఉద్యమం మొదలైందని, అప్పుడు కూడా కాంగ్రెస్ మనల్ని మోసం చేసిందన్నారు.

తెలంగాణ ఇస్తామని నమ్మబలికి 2004లో మనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారని, కానీ వారు మనిషికిన్ని మంత్రి పదవులు పంచుకుని అధికార దాహం తీర్చుకున్నారన్నారు. కానీ తెలంగాణను వదిలి పెట్టారన్నారు. కానీ మనం మాత్రం తెలంగాణను వదల్లేదన్నారు. కొట్టాడుకుంటూ కొట్లాడుకుంటూ పోయాం.. 14 ఏళ్లు గడిచిన తర్వాత తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడే ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే అప్పుడు తెలంగాణ కోసం దిగివచ్చారన్నారు. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయలేదన్నారు. రాజీనామా చేయమంటే లాగులు తడిశాయన్నారు.
ఉద్యమించి మనం తెలంగాణ సాధించుకు వచ్చామన్నారు.

మూడు గంట‌ల క‌రెంట్ అనేటోడు ఎప్పుడైనా పొలం దున్నిండా? అని ప్ర‌శ్నించారు. వ్యవసాయం తెలియదన్నారు. హైద‌రాబాద్‌లో ఎయిర్ కండీష‌న్‌లో ఉంటున్నావని, కానీ నేనేమో రైతునని, తనకు అన్నీ తెలుసునన్నారు. రాహుల్ గాంధీ నాగ‌లి దున్నిండో, వ్యవసాయం చేశాడో తనకు తెలియదన్నారు. ధ‌ర‌ణి కారణంగా రైతుబంధు న‌గ‌దు నేరుగా రైతుల ఖాతాల్లో పడుతోందని, రైతుబీమా కూడా నేరుగా వారికే అందుతోందన్నారు. మ‌రి ధ‌ర‌ణిని తీసేస్తే పైర‌వీకారుల రాజ్యం వస్తుందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా మాట్లాడితే గడ్డం తీసుకోనంటూ సవాల్ చేస్తున్నాడని, కానీ కావాల్సింది శపథాలు కాదని, పని కావాలన్నారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు: కేసీఆర్
మంగళవారం పలువురు పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
దేవుడి దయవల్ల కొత్త ప్రభాకర్ రెడ్డి బతికి బయటపడ్డారన్న కేసీఆర్
హత్యా రాజకీయాలను సహించేది లేదని హెచ్చరిక

మెదక్ లోక్ సభ సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం పలువురు నేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ పార్టీ ఎంపీని చంపాలని చూశారని, అయినప్పటికీ దేవుడి దయవల్ల ఆయన బతికి బయటపడ్డారన్నారు. ఇలాంటి హత్యా రాజకీయాలను సహించేది లేదన్నారు.

హింసాత్మక ఘటనలకు ఎవరు పాల్పడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష శక్తులు ఎన్నో ఉంటాయని, హేయమైన దాడులకు తగిన బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణ అధ్భుత ప్రగతి సాధించిందన్నారు. ప్రతిపక్షాలు దాడులకు పాల్పడుతూ హింసను ప్రేరేపిస్తున్నాయని, మరోసారి బీఆర్ఎస్‌ను గెలిపించి ఇలాంటి శక్తులకు బుద్ధి చెప్పాలన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిలు ఈ రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరిద్దరికి కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైవ్యాఖ్యలు చేశారు.

Related posts

ఏపీలో పోటెత్తిన ఓటర్ …ఎవరికీ లాభం …?

Ram Narayana

జగన్ కు ఏమైంది …విజయవాడ ఆసుపత్రిలో నాలుగు గంటలు …

Ram Narayana

గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు

Drukpadam

Leave a Comment