బూర్జువా పార్టీలకు ముళ్లకర్ర సీపీఐ (ఎం)…బివి రాఘవులు
రాజకీయ దళారీలకు ప్రజా పోరాటాలకు పోటీ
బీజేపీని ఓడిరచే శక్తి సీపీఐ(ఎం) కే ఉంది .
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చిత్తశుద్ధి లేదు..
బీజేపీకి భయపడి బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకోలేదు..
కాంగ్రెస్ హ్యాండ్ పార్టీ కాదు హ్యాండిచ్చే పార్టీ
ఖమ్మం, పాలేరు సీపీఐ(ఎం) అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా బహిరంగసభలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
అవకాశ వాద పార్టీలకు కాకుండా సీపీఐ (ఎం)కు వేసే ప్రతి ఓటు ఆయుధమని, మిగతా పార్టీలకు వేసే ఓటు బేరమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. సీపీఐ (ఎం)కు వేసే ఓటు పోరాటానికి, రెండో ఓటు అవకాశవాద పార్టీలను కడిగిపారేసేందుకు అన్నారు. వామపక్షాల అవసరమేంటో రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బూర్జువా పార్టీలకు సీపీఐ(ఎం) ముళ్లకర్ర అన్నారు. అవకాశవాద పార్టీలకు గుణంపాఠం చెప్పాలన్నారు. ఖమ్మం, పాలేరు సీపీఐ(ఎం) అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా స్థానిక పెవిలియన్‌గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన బహిరంగసభలో రాఘవులు ప్రసంగించారు. నీటి వనరుల కోసం పాదయాత్ర చేసిన ఘనత సీపీఐ(ఎం) అభ్యర్థులకే ఉందన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేసింది కూడా తమ పార్టీ అభ్యర్థులేనన్నారు. డబ్బులు సంపాదించుకొని, ఆ డబ్బులను ఏం చేసుకోవాలో అర్థం కాకుండా ఓట్లు కొనుగోలు చేసే వాళ్లను ఓడిరచాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించుకోవాలంటే బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలను గెలిపించకూడదన్నారు. వామపక్షాలను గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్, బీజేపీని ఓడిరచమనే సీపీఐ(ఎంఎల్) కాంగ్రెస్‌కు ఓట్లేయమనడం సహేతుకం కాదన్నారు. వామపక్షాలకు కాకుండా బూర్జువా పార్టీలకు ఓట్లేస్తామనడం సరికాదన్నారు. వామపక్షాలు కాకుండా ఇంకా ఎవరు ఆలోచన చేస్తారన్నారు. రాజకీయాలను ఉద్యమ రాజకీయాలుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పదవులను అనుభవించడానికి కాదు…వాటి కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదన్నారు. అత్యధిక ఓట్లు సాధించి…సీపీఐ(ఎం)కు ఉన్న బలాన్ని రుజువు చేయాలని కోరారు.
శాసనసభలో కమ్యూనిస్టులు లేనిలోపం కనిపిస్తోంది..
తెలంగాణ శాసనసభలో కమ్యూనిస్టులు లేనిలోపం కనిపిస్తుందన్నారు. ఒక్క కమ్యూనిస్టు ఉన్నా ఆ శాసనసభ రూపు రేఖలే మారిపోతాయన్నారు. శాసనసభ ప్రజావేదికగా కాకుండా బూతుల వేదికగా మారిందని తెలిపారు. అస్సలు సమావేశాలే జరపకుండా ప్రజాస్వామ్యాన్నే ఖూని చేసే పద్ధతి కొనసాగుతుందన్నారు. శాసనసభలో కమ్యూనిస్టు ఎమ్మెల్యే ఒక్కరున్నా ప్రజా వేదికగా మారుతుందన్నారు. పరస్పరం నిందించుకునే బూర్జువా పార్టీలకు ముళ్లు కర్రలాగా పనిచేస్తుందన్నారు. మిగతా పార్టీల అభ్యర్థులకు డబ్బుల సంచులు ఉండొచ్చు…అంతుమించి అవకాశవాదం ఉండొచ్చు…ఇవ్వాళ ఏ పార్టీలో ఉన్నారో…రేపు ఏ పార్టీలో ఉంటారో కూడా వారే చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. రాజకీయాలతో మ్యూజికల్ చైర్స్ ఆడుకునే వాళ్లను గెలిపించుకోవాలా? నిరంతరం ప్రజలు, ప్రజా ఉద్యమాల కోసం పనిచేసే వాళ్లను గెలిపించుకోవాలా? ఆలోచన చేయాలన్నారు. మార్క్సిస్టు పార్టీని బలహీనం చేసి తమ అక్రమాలను అడ్డూ అదుపులేకుండా కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ లక్ష్యానికి మనం అవకాశం ఇద్దమా? ప్రజల తరఫున పోరాడే వారిని గెలిపించుకుందామా? అని ప్రశ్నించారు. ప్రజలు చారిత్రక నిర్ణయాన్ని తీసుకుని సీపీఐ(ఎం) అభ్యర్థులను బలపరచాలని కోరారు.
దేశంలో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఒకరికొకరు పడని పార్టీలను కూడా సీపీఐ(ఎం) ఐక్యం చేస్తుందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న ప్రతి ఒక్కర్నీ ఆహ్వానించేలా తమ పార్టీ విధానాన్ని రూపొందించుకున్నామన్నారు. కేరళలో కాంగ్రెస్, బెంగాల్‌లో తృణమూల్‌తో తగాదాలున్నా బీజేపీని ఒడిరచేందుకు సహకరిస్తున్నామన్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కొంత ప్రయత్నం చేసిందన్నారు. అలాంటి స్థితిలో మునుగోడులో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామన్నారు. బీఆర్‌ఎస్ గొప్ప పార్టీ అనో…ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తెస్తా ఉందనో? ప్రజలకు మేలు చేస్తూ ఉందనో? కాదన్నారు. రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసింది సీపీఐ(ఎం) మాత్రమే అన్నారు. పోడు పోరాటం ఎవరు చేశారు? ఇళ్ల స్థలాల గురించి పోరాటాలు చేస్తుంది సీపీఐ(ఎం) కాదా?, కేసులు పెడుతుంది బీఆర్‌ఎస్ కాదా? అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్‌కు బీజేపీని ఓడిరచాలనే చిత్తశుద్ధి లేదు..
బీఆర్‌ఎస్‌కు బీజేపీని ఓడించాలనే చిత్తశుద్ధి లేదన్నారు. బీజేపీని ఓడిరచడానికి బీఆర్‌ఎస్ ఏమైనా పని కొస్తుందేమో..! అనుకున్నామన్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములు కాబట్టి సీపీఐ(ఎం)తో ఎలా కలుస్తామని బీఆర్‌ఎస్ ప్రశ్నించిందన్నారు. కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుని ఉందని, బీజేపీకి భయపడి కమ్యూనిస్టులతో పొత్తుకు బీఆర్‌ఎస్ ముందుకు రాలేదన్నారు. రేపు ఎన్నికలయ్యాక కాంగ్రెస్ ఊపు ఉంటే దాని చంకన, లేదంటే బీజేపీ ఊపు ఉంటే దాని చంకన కేసీఆర్ ఎక్కుతాడని రాఘవులు అన్నారు. గతంలో కాంగ్రెస్ మంత్రివర్గంలోనూ టీఆర్‌ఎస్ లేదా? ఎవరెన్ని చేసినా అఖిల భారతస్థాయిలో బీజేపీ వ్యతిరేక పోరాటానికి కలిసి వస్తారని తప్ప…ఏదో ఒరగబడుస్తారని కాదన్నారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు ఊడిగం చేయాలా?

కాంగ్రెస్ వ్యవహారం కూడా మనకు తెలియంది కాదన్నారు. కాంగ్రెస్ అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్నారు. కేరళలో సీపీఐ(ఎం)ను ఓడిరచాలని…తెలంగాణలో కమ్యూనిస్టుల ఉనికి లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నా…ఆ పార్టీ కన్నా బీజేపీ ప్రమాదకారి కాబట్టి కాంగ్రెసున్న ఇండియా కూటమిలో ఉన్నామన్నారు. అంబాని, అదానీలు తప్ప ఈ దేశంలో ఎవరూ లేనట్టు బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానం కూడా లేకుండా ఎక్కడికి పోవాలన్నారు. వారికి ఊడిగం చేయడానికి పోవాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తరఫున ఇప్పుడు పోటీ చేస్తున్నవాళ్లు గతంలో ఎక్కడున్నారు…రేపు ఏ పార్టీలో ఉంటారో వాళ్లకైనా తెలుసా? అని ప్రశ్నించారు. వీళ్లు రాజకీయ దళారీలు తప్ప నాయకులు కాదన్నారు. కాంగ్రెస్ హ్యాండ్ పార్టీ కాదు…హ్యాండ్ ఇచ్చే పార్టీ అన్నారు. బీజేపీని ఓడిరచాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉందా? అని ప్రశ్నించారు. పదవులు, అధికారం తప్ప బీజేపీని ఒడిరచాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు కూడా లేదన్నారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి ఒక్క సీపీఐ(ఎం)కు మాత్రమే ఉందన్నారు. ధనవంతులు, కార్మికులు, వ్యవసాయదారులు, కార్పొరేట్లు, ఉత్పత్తిదారులు దోపిడీదారులకు మధ్య పోటీ ఇదని సీపీఐ(ఎం) జాతీయ నాయకులు బి.వెంకట్ అన్నారు.
సమస్త హక్కుల కోసం పోరాడే వాణిగా ఉంటాం: తమ్మినేని

ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపిస్తే సమస్త హక్కుల కోసం పోరాడే వాణిగా ఉంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు పొత్తుల విషయంలో అనుసరించిన మోసపూరిత వైఖరీని ఆయన వెల్లడిరచారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి అభ్యర్థులు యర్రా శ్రీకాంత్, భూక్యా వీరభద్రం, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, బండి రమేష్, వై.విక్రమ్, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.