- వేములవాడ నుంచి తుల ఉమకు బదులు వికాస్ రావుకు బీ ఫామ్ ఇచ్చిన బీజేపీ
- సంగారెడ్డి నుంచి రాజేశ్వరరావు దేశ్‌పాండేకు బదులు పులి మామిడి రాజుకు బీ ఫామ్ అందజేత
- సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్
బీజేపీ చివరి నిమిషంలో వేములవాడ, సంగారెడ్డి అభ్యర్థులను మార్చింది. తొలుత వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి తుల ఉమ, సంగారెడ్డి నియోజకవర్గానికి రాజేశ్వరరావు దేశ్‌పాండేకు టిక్కెట్ కేటాయించారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ వారికి… మొండిచేయి చూపింది. వేములవాడ నుంచి మాజీ గవర్నర్ విద్యాసాగర రావు తనయుడు డాక్టర్ వికాస్ రావుకు, సంగారెడ్డి నుంచి పులి మామిడి రాజుకు బీ ఫామ్‌లు ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ కూడా చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చింది. నారాయణఖేడ్ నుంచి సంజీవ్ రెడ్డిని ప్రకటించింది. తొలుత సురేష్ షేట్కార్ పేరును ప్రకటించింది. అయితే సురేశ్ షేట్కార్, సంజీవరెడ్డిలతో మాట్లాడి ఇద్దరి మధ్య అధిష్ఠానం సయోధ్య కుదిర్చింది. షేట్కార్‌కు లోక్ సభ సీటు హామీ ఇచ్చింది. దీంతో ఆయన సంజీవరెడ్డికి సహకరించేందుకు అంగీకరించారు. సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డిల పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు చివరకు దామోదర్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. తమకు టిక్కెట్ రాకపోవడంతో పటేల్ రమేశ్ రెడ్డి విలపించారు.
నామినేషన్ దాఖలు చేయడానికి ఈ రోజు వరకు గడువు ఉంది. హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిర్పూర్‌లో బీఎస్పీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొత్తగూడెం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జలగం వెంకటరావు, హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.