- వేదిక మీదకు మోదీ రాగానే మంద కృష్ణ మాదిగ భావోద్వేగం
- మోదీ పేద కుటుంబం నుంచి వచ్చి దేశ ప్రధానిగా ఎదిగారన్న కిషన్ రెడ్డి
- నరేంద్ర మోదీ వద్దకు వర్గీకరణ అంశాన్ని తీసుకు వెళ్లామన్న కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్రమోదీ శనివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భుజం తట్టారు. పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆయన వేదికపైకి రాగానే మంద కృష్ణ మాదిగ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. దీంతో ప్రధాని మోదీ… మంద కృష్ణ మాదిగ భుజం తట్టి ఓదార్చారు.
పేద కుటుంబం నుంచి వచ్చి ప్రధాని అయ్యారు: కిషన్ రెడ్డి
నరేంద్రమోదీ పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు మన దేశ ప్రధానిగా ప్రపంచ అగ్రనేతగా మారారని కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాడుతున్నారన్నారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాల మేరకు అందరికీ సమన్యాయం జరగాలన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం పలు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.. కానీ ఎవరూ నెరవేర్చలేదన్నారు. కానీ ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ వచ్చినప్పుడు వర్గీకరణ గురించి ఆయనకు చెబితే అంగీకరించారన్నారు. మంద కృష్ణ మాదిగపై ఎన్నో అపవాదులు వచ్చినా ఉద్యమాన్ని మాత్రం ఆపలేదని కిషన్ రెడ్డి ప్రశంసించారు.