- జగిత్యాల మండలం ఇటిక్యాలలో కవిత ప్రచారం
- నిలబడటానికి ఇబ్బంది పడ్డ కవిత
- వాహనంపైనే పడుకోబెట్టి సపర్యలు చేసిన సహచరులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిలబడటానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఛాతీ భాగాన్ని కూడా రెండు, మూడు సార్లు నొక్కుకున్నారు. అనంతరం ఆమె వాహనంపై పడిపోయారు. వాహనంపైనే ఆమెను పడుకోబెట్టి సపర్యలు చేశారు. కవిత పడిపోవడంతో అక్కడున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి ఆమె కోలుకున్నారు. అయితే, ఆమె ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
నేను బాగానే ఉన్నా: కవిత
- ఇటిక్యాలలో ప్రచారం నిర్వహిస్తుండగా అస్వస్థత
- కళ్లు తిరిగి పడిపోయిన వైనం
- స్థానిక కార్యకర్త ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న కవిత
ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం ఇటిక్యాలలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. ఆ తర్వాత ఆమె స్థానికంగా ఉన్న ఓ కార్యకర్త ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆమె తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.
మరోవైపు తాను ఆరోగ్యంగా ఉన్నానని ఎక్స్ వేదికగా ఆమె తెలిపారు. విశ్రాంతి తీసుకున్న ఇంట్లో ఒక చిన్నారితో ముచ్చటించిన వీడియోను ఆమె షేర్ చేశారు. చిన్నారితో గడిపిన తర్వాత తనకు మరింత శక్తి వచ్చినట్టు అనిపించిందని చెప్పారు. డీహైడ్రేషన్ కారణంగా ఆమెకు కళ్లు తిరిగినట్టు తెలుస్తోంది.