మిత్ర ధర్మాన్ని పాట్టిదాం…ఉమ్మడి అభ్యర్థులను గెలిపిద్దాం…
బీఆర్ యస్ ,బీజేపీ ,ఎంఐఎం ఒకే తాను ముక్కలు
ఖమ్మంలో తుమ్మలను గెలిపించాలి
ఖమ్మం నియోజక వర్గ సమావేశంలోసిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ
దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఐ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయని ఉమ్మడి అభ్యర్థులను అత్యథిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నియోజక వర్గ సిపిఐ సమితి సమావేశం శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది. నియోజక వర్గ కన్వీనర్ ఎస్ కె జానిమియా అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ -మాట్లాడుతూ బిజెపి పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. మత పరమైన విభజన తీసుకువచ్చి రాజకీయ లబ్ది పొందెందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇదే సమయంలో అవసరమైన ప్రతిసారి బిజెపికి -వంతపాడుతూ కేసిఆర్ తెలంగాణను పాలిస్తున్నారన్నారు. బయటకి వేర్వేరు పార్టీలుగా కనిపించిన బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం ఒకే తాను ముక్కలని నారాయణ తెలిపారు. ఇటువంటి స్థితిలో బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎంలను ఓడించేందుకు కాంగ్రెస్తో జట్టు కట్టామని ఆయన తెలిపారు. ఉమ్మడి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఖమ్మంలో సిపిఐ బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావును గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజాపాషా, జిల్లా కార్యదర్శి -పోటు ప్రసాద్, సహయ కార్యదర్శి దండి సురేష్, నాయకులు మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్రెడ్డి, కార్పొరేటర్లు బిజి క్లెమెంట్, చామకూరి వెంకటనారాయణ, మహ్మద్ సలాం, మేకల శ్రీనివాసరావు, పగడాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.