- గతంలో మంత్రిగా పని చేశానన్న ఎమ్మెల్యే వినోద్
- మంత్రి పదవి కోసం సోనియా గాంధీకి విజ్ఞాపన పత్రం ఇచ్చినట్లు వెల్లడి
- సీఎం ఎంపికపై ఢిల్లీ పెద్దలు చర్చలు జరుపుతున్నారన్న వినోద్
మంత్రి పదవి కోసం తాను సోనియా గాంధీతో భేటీ అయ్యానని, తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వీకరిస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అన్నారు. ఆయన మంగళవారం సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తనకు కేబినెట్లో అవకాశం కల్పించాలని, ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వీకరిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా పని చేశానన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశంతో మరోసారి కేబినెట్‌లో చోటు కోసం ఢిల్లీకి వచ్చానని స్పష్టం చేశారు. ఈ మేరకు సోనియాకు విజ్ఞాపనపత్రం అందించినట్లు తెలిపారు. మంత్రి పదవి ఖాయమనే సంకేతాలు ఉన్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఎంపికపై సీనియర్లు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇవాళ లేదంటే రేపు ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ఏడో తేదీన లేదా తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండవచ్చునని తెలిపారు. సీఎం అభ్యర్థిత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేల అందరి అభిప్రాయాలను అధిష్ఠానానికి పంపించారని, ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. తాను వెంకటస్వామి కొడుకునని, అధిష్ఠానానిదే తుది నిర్ణయమన్నారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని, ఏ శాఖ ఇచ్చినా మేనేజ్ చేస్తానన్నారు.