కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే కెసిఆర్ పై ఫిర్యాదు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పై సమగ్రదర్యాప్తు జరిపించాలని హైకోర్టు న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్ ఏ సి బి కి ఫిర్యాదు ..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన రోజే మాజీ సీఎం కేసీఆర్‌కు షాక్ తగిలింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతి పై సమగ్ర దర్యాప్తు జరి పించాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పోలవరం కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాగు, సాగు నీటి ప్రాజెక్టు పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు లో భారీగా ఆర్థిక అవతవ కలు జరిగాయని, నకిలీ ఎస్టిమేషన్ల ద్వారా వేలాది కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని ఆరోపించారు.
తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్ణయం జరిగిందన్నారు.
మొత్తం ప్రాజెక్టు పనులు 7 లింకుల కింద 228 ప్యాకేజీలు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అయితే పనులు జరుగు తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రులుగా హరీష్ రావు, కేటీఆర్, ఎంపీగా కవిత ఎన్నికయ్యారని ఫిర్యాదు లో పేర్కొన్నారు ..
ఆ తర్వాత వీరంతా ప్రాజెక్టు అలైన్మెంట్లు, డిజైన్లు మార్చి వేసి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిని, అంచనాలను పెంచారని ఆరోపించారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకోవాలని ప్రణాళిక రచించారని దీనిపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అన్నారం బ్యారేజీ వద్ద లీకులు కనిపించాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం పేరుతో కేసీఆర్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే ఏసీబీకి ఈ ఫిర్యాదు రావడంతో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది..