- దేవుడి దయ వల్ల పర్చూరు నుంచి ఓడిపోవడమే మంచిదైందన్న దగ్గుబాటి
- గెలిచి ఉంటే రోడ్లు ఎందుకు వేయలేదని ప్రజలు ప్రశ్నించేవారని వ్యాఖ్య
- తన కుమారుడికి జగన్ మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారన్న దగ్గుబాటి
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తాను గెలవకపోవడమే మంచిదైందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. ఒకవేళ గెలిచి ఉంటే రోడ్లు ఎందుకు వేయలేదని ప్రజలు తనను నిలదీసేవారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈ దారుణమైన రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరిగేవాడిని కాదని చెప్పారు. దేవుడి దయ వల్ల పర్చూరులో తాను ఓడిపోవడం మంచిదైందని అన్నారు.
వైసీపీ పాలనలో కారంచేడులో ఒక్క రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. తన వ్యక్తిత్వాన్ని కాపాడటానికే దేవుడు తనను ఓడించాడని అన్నారు. తాను ఓడిపోయిన రెండు నెలల తర్వాత తనను పిలిపించిన జగన్… తన కుమారుడిని ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవి ఇస్తానని చెప్పారని… అయితే ఆయన పెట్టిన నిబంధనలకు తలొగ్గలేక జగన్ ఆఫర్ ను తిరస్కరించామని తెలిపారు. మనకు వైసీపీ సరైన పార్టీ కాదని తన కుమారుడు తనకు చెప్పాడని అన్నారు. కారంచేడు గ్రామస్తులతో ఈరోజు దగ్గుబాటి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.