- పార్టీని వీడుతున్నట్లు ట్విట్టర్ లో వెల్లడించిన మాజీ క్రికెటర్
- రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడి
- త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అధికార పార్టీని వీడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానంటూ తన ట్వీట్ ల్ వెల్లడించారు. కొంతకాలంగా జగన్ పాలనపై అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. గతేడాది డిసెంబర్ 28న ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే, రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు రాయుడు తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి షాక్ ఇచ్చారు. వైసీపీలో చేరి 10 రోజులు కూడా తిరక్కుండానే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని… కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఈరోజు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాయుడు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ స్పందించింది. జగన్ లాంటి విపరీత ధోరణి ఉన్న వ్యక్తితో కలిసి మీరు రాజకీయ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉందని టీడీపీ ట్వీట్ చేసింది. మీ భవిష్యత్తు ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.
పోటీ నుంచి తప్పుకుంటా: వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
- గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని లావుకు చెప్పిన జగన్
- గుంటూరు నుంచి పోటీ చేయలేనన్న లావు
- నరసరావుపేట టికెట్ ను బీసీలకు ఇవ్వాలనుకుంటున్న జగన్
వైసీపీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తుండటం తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారు. గుంటూరు నుంచి పోటీ చేయాలని ఆయనకు సూచించారు. అయితే, తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని జగన్ కు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. నరసరావుపేట ఎంపీ స్థానం నుంచే లావుకు టికెట్ ఇవ్వాలని ఆ నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం చెప్పినప్పటికీ జగన్ నిరాకరించారు. దీంతో, గుంటూరు నుంచి తాను పోటీ చేయలేనని, ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటానని లావు స్పష్టం చేశారు. నరసరావుపేట టికెట్ ను బీసీలకు ఇవ్వాలనుకుంటున్నట్టు జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.