- 41 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు
- డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని స్పష్టీకరణ
- ఛలో విజయవాడకు అనుమతి లేదన్న పోలీసులు
- నిర్బంధాలతో తమను అడ్డుకోలేరన్న అంగన్వాడీలు
తమ డిమాండ్ల సాధన కోసం ఏపీలోని అంగన్వాడీలు 41 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘జగనన్నకు చెబుదాం’ పేరిట రేపు అంగన్వాడీలు ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కోటి సంతకాల ప్రతులను ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు వస్తున్నామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.
అయితే, అంగన్వాడీల ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీనిపై అంగన్వాడీలు స్పందిస్తూ, ఛలో విజయవాడ నిర్వహించి తీరుతామని అన్నారు. నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు. డిమాండ్లు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగుతుందని ఉద్ఘాటించారు.
రేపటి ‘ఛలో విజయవాడ’ నేపథ్యంలో, ఇప్పటికే పలుచోట్ల అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
అటు, విజయవాడలో గత ఐదు రోజులుగా అంగన్వాడీలు నిరాహార దీక్ష చేస్తున్నారు. వారి పరిస్థితి విషమించడంతో ఇప్పటికే పలువురిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, తాజాగా మరో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు.