Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

బి.జె.పి… కొత్త అర్థం చెప్పిన షర్మిల!

  • ఏలూరులో షర్మిల ప్రసంగం
  • టీడీపీకి ఓటేసినా, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టేనని వెల్లడి
  • జనసేనకు ఓటేసినా బీజేపీ ఖాతాలోకే వెళుతుందని వ్యాఖ్యలు
  • ఈ మూడు పార్టీలు బీజేపీకి దాసోహం అయ్యాయని విమర్శలు
  • ఏపీలో బీజేపీ ఒక్క సీటు గెలవకపోయినా రాష్ట్రంపై పెత్తనం చేస్తోందని ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరులో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన నాటికి ఏపీకి ఉన్న అప్పులు రూ.1.80 లక్షల కోట్లు అని వెల్లడించారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన హయాంలో మరో రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. గత ఐదేళ్లుగా జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని, వైసీపీ పాలనలో ఈ ఐదేళ్లలో చేసిన అప్పులు ఎనిమిది లక్షల రూపాయలు అని షర్మిల వివరించారు. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు చూస్తే మొత్తం అప్పు రూ.11 లక్షల కోట్లకు పైమాటేనని అన్నారు. 

“ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించిన వాస్తవం ఇదీ. ఈ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసింది కదా… మరి రాష్ట్రంలో ఆ డబ్బు (అభివృద్ధి) కనిపిస్తోందా? మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎకానమీలో ఎక్కడికో వెళ్లిపోయేది. ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చినా రాష్ట్రంలో కనీసం ఒక మెట్రో కూడా లేదు. 

రూ.8 లక్షల కోట్ల అప్పు తెచ్చారు కదా… రాజధాని కట్టారా? అసలు రాజధాని ఉందా? చంద్రబాబేమో అమరావతి రాజధాని అన్నారు, సింగపూర్ లా చేస్తానన్నారు. త్రీడీ గ్రాఫిక్స్ తో ఆకాశంలోనే సినిమా చూపించారు. రాజధాని కట్టేస్తాడేమో అనుకున్నారు… తీరా చూస్తే ఏమీ కాలేదు. 

ఆ తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. పోనీ ఇప్పుడైనా మనకో రాజధాని వస్తుందనుకుంటే… మూడు రాజధానులు అన్నారు. మొత్తం గందరగోళమే! మూడింట్లో ఒక్కటి కూడా రాజధాని కాలేదు. ఇదీ ఈ రోజు ఈ వాస్తవం. రూ.8 లక్షల కోట్లు అప్పు తెచ్చారు కదా… కనీసం పోలవరం అయినా కట్టారా? అదీ లేదు. 

పోలవరం రాజశేఖర్ రెడ్డి గారి కలల ప్రాజెక్టు. 1941లోనే పోలవరం కట్టాలనుకున్నారు. కానీ, అంత సాహసం నాటి నేతలు చేయలేకపోయారు. రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యాక రూ.10 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు ప్రారంభించారు. 20 లక్షల ఎకరాలను నీరు అందించేలా పోలవరంకు రూపకల్పన చేశారు. రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ ప్రాజెక్టు ముఖం చూసినవాళ్లే లేరు. 

2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలు మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు అన్న చంద్రబాబు… పోలవరం కోసం నిధులు తీసుకురాలేకపోయారు. మాకు డబ్బులు ఇవ్వండి… మేమే పోలవరం కట్టుకుంటాం అని చెప్పారు. రూ.15 వేల కోట్లు తెచ్చుకుని కూడా పోలవరం పూర్తి చేయలేకపోయారు. 

ఇక, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తానని ప్రకటించారు. తీరా చూస్తే ప్రాజెక్టు వ్యయం రూ.55 వేల కోట్లు అన్నారు. టీఎంసీలు సగానికి సగం తగ్గించారు. తీసుకువచ్చిన రూ.8 లక్షల అప్పులో పోలవరానికి రూ.55 వేల కోట్లు ఖర్చు చేయలేకపోయారు. దాంతో పోలవరం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. 

ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న అంశాన్ని అధికారంలోకి వచ్చిన వారు ఎందుకో గానీ పూర్తిగా మర్చిపోతున్నారు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నానన్న చంద్రబాబు… అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినవారిపై కేసులు పెట్టి జైలుకు పంపారు. 

జగనన్న గారేమో ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ ప్రత్యేక హోదా పాట పాడారు.. సాగదీసి, రాగం తీసి పాట పాడారు. ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. 25 మంది ఎంపీలతో మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ఇవ్వరు ప్రత్యేక హోదా? అంటూ ఆ రోజున జగనన్న గారు అన్నారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక జగనన్న గారు ప్రత్యేక హోదా అంశాన్నే పూర్తిగా విస్మరించారు. 

రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రబాబు గెలిచారు, ఇప్పుడు జగనన్న గెలిచారు… ప్రజలు టీడీపీకి ఎమ్మెల్యేలను ఇచ్చారు, వైసీపీకి ఎమ్మెల్యేలను ఇచ్చారు… బీజేపీకి ఒక్క ఎమ్మెల్యేను కూడా ఇవ్వలేదు. అయినా ఇవాళ రాష్ట్రంలో ఎవరు రాజ్యం ఏలుతున్నారు అంటే… బీజేపీనే. చంద్రబాబు అయినా, జగన్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా ఇవాళ అందరూ బీజేపీకి బానిసలు అయిపోయారు. వీళ్లు బానిసలు కావడమే కాకుండా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఒక్క సీటు లేకపోయినా ఏపీ మొత్తం బీజేపీ వశమైపోయింది. ఇవాళ  బీజేపీకి ఇంత మద్దతు ఎందుకు ఇస్తున్నారంటే సమాధానం లేదు. 

ప్రత్యేక హోదా ఇచ్చినా, పోలవరం పూర్తయినా, రాజధాని కట్టినా బీజేపీకి ప్రజలందరూ దండాలు పెట్టేవారు. పదేళ్లలో రాష్ట్రంలో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా లేవు. మరి ఎందుకు బీజేపీకి దాసోహం అంటున్నారు? 

విశాఖ ఉక్కు పరిశ్రమ మన రాష్ట్రానికే తలమానికం. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అవుతుందని 30 వేల మంది ఉద్యోగులు బాధపడుతున్నారు. పక్కనే జింక్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేశారు. అక్కడివాళ్లకు ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు వేదాంత వాళ్లు రియల్ ఎస్టేట్ చేస్తారట!

సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేమే ఆపాం అని చెబుతున్నారు… మీరు అంత భరోసాగా చెబుతుంటే మరి స్టీల్ ప్లాంట్ కార్మికులు మూడేళ్లుగా ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? 22 మంది ఎంపీలను ఆంధ్ర ప్రజలు ఇస్తే మూకుమ్మడిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడంలేదు? నాడు స్పెషల్ స్టేటస్ కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్న వైసీపీ వాళ్లు స్టీల్ ప్లాంట్ విషయంలో ఆ మాట ఎందుకు అనడంలేదు? 

రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నా… బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు వైసీపీ, టీడీపీ. మన కంటికి కనిపించినా, కనిపించకపోయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి బానిసలు. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. 

ఈ రెండు పార్టీలే కాదు… జనసేన పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. బీజేపీ అంటే ఏమిటో కాదు…. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్.. బీజేపీ అంటే ఎక్కడో లేదు… వీళ్లలోనే ఉంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తిరిగి ఈ విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పాలి” అని షర్మిల స్పష్టం చేశారు.

Related posts

రాజకీయాల్లోకి కృష్ణంరాజు భార్య.. ఆమె ఏమన్నారంటే..!

Ram Narayana

అతడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే: జగన్ పై హోంమంత్రి అనిత వ్యంగ్య బాణాలు!

Ram Narayana

మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాసు.. మీ జాతకాలు నా వద్ద ఉన్నాయంటూ హెచ్చరికలు!

Ram Narayana

Leave a Comment