- ఇటీవలే గోవా కేంద్రంగా తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన ‘ఫ్లై91’
- హైదరాబాద్ నుంచి గోవాకు మంగళవారం ప్రారంభమైన కొత్త విమాన సర్వీస్
- హైదరాబాద్ నుంచి సింధుదుర్గ్, గోవాకు వారానికి రెండు విమాన సర్వీసులు నడిపిస్తామన్న సంస్థ సీఈఓ మనోజ్ చాకో
‘ఫ్లై91’ అనే కొత్త దేశీయ విమానయాన సంస్థ ఇటీవల గోవా కేంద్రంగా తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం గోవా నుంచి బెంగళూరుకు విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ విమాన టికెట్ ధర కేవలం రూ. 1991 (అన్నీ చార్జీలు కలుపుకొని) మాత్రమే. అలాగే బెంగళూరు నుంచి సింధుదుర్గ్‌కు కూడా ఇదే రోజు విమాన సర్వీసును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక మంగళవారం హైదరాబాద్ నుంచి గోవాకు ‘ఫ్లై91’ మరో విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ విమాన సర్వీస్ టికెట్ ధర కూడా రూ. 1991 గానే నిర్ణయించింది. అంతేగాక హైదరాబాద్ నుంచి సింధుదుర్గ్, గోవాకు వారానికి రెండు విమాన సర్వీసులు నడపనున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మనోజ్ చాకో వెల్లడించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సోమ, శుక్ర, శనివారాల్లో గోవా నుంచి బెంగళూరు మధ్య విమాన సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఏప్రిల్ నాటికి అగట్టి, జల్గావ్, పుణే వంటి నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని అన్నారు. అందరికీ విమానయాన సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా తక్కువ ధరకు విమాన సర్వీసులు నడిపిస్తున్నట్లు సీఈఓ వెల్లడించారు. దేశంలో ఇంతకుముందు ఎవ్వరూ అమలు చేయని తక్కువ ధరలకు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని మనోజ్ చాకో చెప్పుకొచ్చారు.