- జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురాజు పిటిషన్
- కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐకీ సుప్రీం ప్రశ్న
- విచారణ వేగంగా పూర్తి చేయాలని ఆదేశం
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన మరో పిటిషన్ కూడా వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారించింది.
విచారణ సందర్భంగా… అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ ఆలస్యం కావడానికి గల కారణాలను వివరిస్తూ నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా విచారణ ఆలస్యం అవుతోందని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఎం, రాజకీయ నేత అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. జగన్ బెయిల్ రద్దు, కేసుల విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్లను కలిపే విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఆగస్ట్ 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.