మరి అప్పుడే ఈటల ఎందుకు రాజీనామా చేయలేదు?: టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి
-ఈటలను పార్టీ ఎంతగానో గౌరవించింది
-ప్రగతి భవన్‌లోకి రానివ్వలేదని ఈటల చెబుతున్నారు
-టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తూ విమర్శలు చేస్తున్నారు
-గతంలోనూ చాలా మంది నేతలు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తూ విమర్శలు..
తాను ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని స్పష్టం చేస్తూ తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండిపడ్డారు. గతంలో టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభాపక్ష నేతగానూ ఈటలకు అవకాశం దక్కిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణలో ఏ పథకం తీసుకురావాలని చూసినా ఈటల రాజేందర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవారని, అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరేవారని అన్నారు.
ఈటలను పార్టీ ఎంతగానో గౌరవించిందని ఆయన చెప్పారు. ప్రగతి భవన్‌లోకి రానివ్వలేదని ఈటల చెబుతున్నారని, అందులోకి రానివ్వకపోతే మరి అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తూ విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌పై ఎన్నో అసత్య ప్రచారాలకు తెరదీశారని ఆయన చెప్పారు.
గతంలోనూ చాలా మంది నేతలు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తూ కేసీఆర్‌పై విమర్శలు చేశారని ఇప్పుడు ఈటల కూడా వారినే అనుసరిస్తూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ధాన్య సేకరణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దంటే తాను కావాలన్నానని ఈటల అసత్యాలు చెబుతున్నారని ఆయన చెప్పారు.