నిప్పుల కుంపటిలా తెలుగురాష్ట్రాలు …
ఈ సమయంలో ఎవరూ బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
తెలంగాణ వ్యాపితంగా భానుడి భగభగలు
ఏపీ లోని 17 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు
దేవరాపల్లి, పోరుమామిళ్లలో 44.5 డిగ్రీలు
నేడు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 దాటేవరకు బయటకు రావొద్దని హెచ్చరికలు
తెలుగురాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు …దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాలో నిప్పుల కుంపటిని తపిస్తున్నాయి . అనేక జిల్లాల్లో నిన్న 42 డిగ్రీలకుపైనే నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. తెలంగాణలోని రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ తో సహా ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడం ,ఖమ్మం మహబూబాబాద్ , వరంగల్ , నల్గొండ మెదక్ , నిజామాబాద్ , ఆదిలాబాద్ లలో గత రెండు రోజులుగా 43 ,44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు …ఉక్కపోతలకు తట్టుకోలేకపోతున్నారు … ఏపీలోని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ తొలివారంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే మే నెల పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏపీ రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. నేడు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. అలాగే, ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు దాటే వరకు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీచేసింది.