- రిలయన్స్ ఇన్‌ఫ్రాంకు ప్రభుత్వ సంస్థ డీఎమ్ఆర్‌సీ రూ.8వేల కోట్లు ఇవ్వక్కర్లేదన్న సుప్రీం
- ఈ కేసులో మునుపటి తీర్పును పక్కన పెట్టిన వైనం
- గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ‘సుప్రీం’ జోక్యం చేసుకునేందుకు కారణం లేదని వ్యాఖ్య
ఒకప్పుడు అపరకుబేరుడిగా ఓ వెలుగువెలిగిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సుప్రీం కోర్టులో ఆయనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (డీఏఎమ్ఈపీఎల్).. ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్‌సీ) రూ.8 వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
కేసు వివరాలు ఇవీ..
2008లో రిలయన్స్ ఇన్‌ఫ్రాకు అనుబంధ కంపెనీ అయిన డీఏఎమ్ఈపీఎల్, ప్రభుత్వ రంగ సంస్థ డీఎమ్ఆర్‌సీలు ఒక కన్సెషన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందంపై వివాదం మొదలవడంతో విషయం కోర్టుకు చేరింది. చివరకు డీఎమ్ఆర్‌సీకి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. దీనిపై డీఎమ్ఆర్‌సీ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను అంగీకరించిన ధర్మాననం, తాజాగా అనిల్ అంబానీకి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.
ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో సరైన నిర్ణయమే తీసుకుందని, అందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టుకు ఎటువంటి కారణమూ కనిపించడం లేదని చెబుతూ మునుపటి తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పక్కన పెట్టింది.
సుప్రీం తీర్పు నేపథ్యంలో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేరు ధర బుధవారం బీఎస్‌ఈలో 19.99 శాతం మేర నష్టపోయి రూ.227.40 వద్ద స్థిరపడింది.