- శ్రీపెరుంబుదూర్-కుండ్రత్తూర్ రహదారిపై పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్
- ఓ లారీ నుంచి 1025 కేజీలు, మరో వాహనం నుంచి 400 కేజీల బంగారం స్వాధీనం
- 400 కేజీల బంగారానికి మాత్రమే ఆధారాలు
- చెన్నై కస్టమ్స్ అధికారులకు పోలీసుల సమాచారం
ఎన్నికల వేళ తమిళనాడులో పెద్దమొత్తంలో బంగారం బయటపడింది. కాంచీపురం జిల్లాలో ఏకంగా 1400 కిలోల బంగారం పట్టుబడింది. శ్రీపెరుంబుదూర్-కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ వాహన తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను అధికారులు సోదా చేశారు.
ఈ సందర్భంగా లారీలో 1000 కిలోల బంగారం, మరో వాహనంలో 400 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం విలువ రూ. 700 కోట్లకు పైనేనని అధికారులు తెలిపారు. ఈ మొత్తం బంగారంలో 400 కిలోల పుత్తడికి మాత్రమే ఆధారాలు ఉన్నాయని, మిగతా 1000 కేజీలకు లేవని అధికారులు తెలిపారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్ సమీపంలో ఉన్న మన్నూరులోని గోదాముకు తరలిస్తున్నట్టు తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బంగారం విషయం చెన్నై విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు.