Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రికెట్ వార్తలు

తన రికార్డు తానే బద్దలు కొట్టిన సన్ రైజర్స్… ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు…

  • ఐపీఎల్ లో సన్ రైజర్స్ × ఆర్సీబీ
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులు చేసిన సన్ రైజర్స్
  • ఇటీవలే 277 పరుగులు చేసి రికార్డు సృష్టించిన సన్ రైజర్స్
  • ఇప్పుడా రికార్డు తెరమరుగు
  • ట్రావిస్ హెడ్ సెంచరీ… క్లాసెన్, అబ్దుల్ సమద్ మాస్ కొట్టుడు

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డును మరోసారి బద్దలు కొట్టింది. గతంలో ఐపీఎల్ హయ్యస్ట్ స్కోరు 263 పరుగులు ఉండగా, ఇటీవలే 277 పరుగులు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టిన సన్ రైజర్స్… ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 287 పరుగులు చేసి తన రికార్డును తానే అధిగమించింది. 

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల అతి భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ హైలైట్ గా నిలుస్తుంది. హెడ్ 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేయడం విశేషం. 

ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ తన ట్రేడ్ మార్క్ బుల్లెట్ షాట్లతో ఆర్సీబీ బౌలర్లను హడలెత్తించాడు. క్లాసెన్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ఐడెన్ మార్ క్రమ్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 32… అబ్దుల్ సమద్ 10 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సులతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 

అంతకుముందు, ఓపెనర్ అభిషేక్ శర్మ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్ల ఊచకోత మామూలుగా సాగలేదు. తొలుత ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సెంచరీ భాగస్వామ్యంతో ఆర్సీబీ బౌలర్లను చీల్చిచెండాడారు. 

బెంగళూరు జట్టుకు సొంతగడ్డపై ఆడుతున్నామన్న భావనే లేకుండా పోయింది. ఆ జట్టులో బౌలర్లు, ఫీల్డర్లకు మధ్య ఏ దశలోనూ సమన్వయం కనిపించలేదు. దాదాపు ప్రతి ఓవర్లోనూ సన్ రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపించేలా కొట్టడంతో ఆర్బీబీ బౌలర్లు మళ్లీ ఇంకో ఓవర్ వేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ మ్యాచ్ లో నలుగురు ఆర్సీబీ బౌలర్లు అర్థసెంచరీ పరుగులు సమర్పించుకున్నారు. రీస్ టాప్లే 4 ఓవర్లలో 68, యశ్ దయాళ్ 4 ఓవర్లలో 51, లాకీ ఫెర్గుసన్ 4 ఓవర్లలో 52, విజయ్ కుమార్ వైశాఖ్ 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చారు. మహిపాల్ లోమ్రోర్ ఒక ఓవర్ విసిరితే 18 పరుగులు బాదారు. ఆ తర్వాత అతడు మళ్లీ బౌలింగ్ కు రాలేదు. 

క్లాసెన్ కొట్టిన పలు సిక్స్ లు స్టాండ్స్ లో బాగా లోపలికి వెళ్లి పడ్డాయి. సమద్ కొట్టిన ఓ సిక్స్ స్టేడియం పైకప్పును తాకడం విశేషం. ఆర్సీబీ బౌలర్లలో ఫెర్గుసన్ 2, టాప్లే 1 వికెట్ తీశారు.

Related posts

రెండవ టెస్ట్ లోను టీం ఇండియా తడబాటు …

Ram Narayana

డెత్ ఓవ‌ర్ల మొన‌గాడు దినేష్ కార్తీక్

Ram Narayana

సూర్య పట్టిన క్యాచ్ పై దక్షిణాఫ్రికా ఫ్యాన్స్ వంకరబుద్ధి …

Ram Narayana

Leave a Comment