Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఇంట గెలిచి రచ్చ గెలవాలి..రేవంత్ రెడ్డి

ఇక్కడ తప్పిదం జరిగితే నేను జాతీయస్థాయిలో చెప్పుకునే పరిస్థితి ఉండదు

  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెజార్టీ సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారన్న రేవంత్ రెడ్డి
  • నన్ను పెంచి పోషించింది మీరే… అలాంటి నన్ను నరుకుతా అంటే మీరు నరకనిస్తారా? అన్న ముఖ్యమంత్రి
  • మీరు పెంచిన చెట్టు మహా వృక్షమై పండ్లు ఇచ్చింది… ఇప్పుడూ మీ చేతుల్లోనే ఉందని వ్యాఖ్య

‘ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి… నా పాలమూరులో తప్పిదం జరిగితే (కాంగ్రెస్ ఓడిపోతే) నేను జాతీయస్థాయిలో చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేశారు.. నన్ను పెంచి పోషించింది మీరే… ఈరోజు నన్ను నరుకుతా అంటే మీరు నరకనిస్తారా?’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

నారాయణపేట జనజాతర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… ఈ చెట్టును (తనను తాను ఉద్దేశించుకొని) నాటింది మీరు… పెంచింది మీరు…  అని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు. మీరు పెంచిన చెట్టు మీకు నీడను ఇస్తుంటే నరకనిస్తారా? అన్నారు. మీరు పెంచిన చెట్టు మహా వృక్షమై పండ్లు ఇచ్చిందని… ఇప్పుడూ మీ చేతుల్లోనే ఉందన్నారు.

పాలమూరు పేదింటి రైతుబిడ్డను… నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఓర్వలేకపోతున్నారు?: రేవంత్ రెడ్డి నిలదీత

  • మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి
  • పేదలు, బీసీ కులాలకు టిక్కెట్లు ఇచ్చామన్న ముఖ్యమంత్రి
  • బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం పెట్టుకున్నాయని ఆరోపణ
  • మంత్రులు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారని కితాబునిచ్చిన ముఖ్యమంత్రి
  • తనపై కోపం ఉంటే తనతో కొట్లాడాలన్న రేవంత్ రెడ్డి
  • అగస్ట్ లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి
Revanth Reddy interesting comments in Jana Jathara sabha

‘పాలమూరు బిడ్డను… రైతుబిడ్డను… పేదింటి బిడ్డను… అలాంటి నేను ముఖ్యమంత్రిని అయితే ఎందుకు ఓర్వలేకపోతున్నారు? ఎప్పుడూ దొరల బిడ్డనే ముఖ్యమంత్రి కావాలా? ఆ తర్వాత మనవడు కావాలా? పాలమూరు బిడ్డ మాత్రం కావొద్దా? మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి మాకు లేదా? కాగితాలపై సంతకం చేసే సత్తా మాకు లేదా?’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేటలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో దొరలకు టిక్కెట్లు ఇవ్వలేదని… అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పేదలు, బీసీ కులాలకు టిక్కెట్లు ఇచ్చామన్నారు. 

మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చాం

అధికారంలో ఉన్నప్పుడు మాదిగలకు అన్యాయం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. మాదిగలకు తమ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. వర్గీకరణకు పార్టీని ఒప్పించి బిల్లు పెట్టించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంద కృష్ణ మాదిగను అన్యాయంగా అరెస్ట్ చేస్తే గళమెత్తింది తానే అన్నారు. 

మక్తల్ నియోజకవర్గంలో ముదిరాజ్ బిడ్డకు టిక్కెట్ ఇచ్చి మనం గెలిపించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ముదిరాజ్ జనాభా పది శాతం ఉందని, కానీ వారికి కేసీఆర్ ఒక్క టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో 14 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ముదిరాజ్‌లకు మంత్రి పదవి ఇస్తామన్నారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ సీకి మార్చాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలన్నారు. బంగ్లా రాజకీయాలను కుర్మ, యాదవులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యాదవ బిడ్డ అనిల్‌కు తాము రాజ్యసభ ఇచ్చి గౌరవించామన్నారు.

బీఆర్ఎస్‌తో డీకే అరుణ కుమ్మక్కయ్యారని ఆరోపణ

నారాయణపేట ప్రజలు ఎన్నో ఏళ్లుగా రైలు కూత కోసం ఎదురు చూస్తున్నారని, కానీ ఈ ప్రాంతం నుంచి గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎప్పుడూ రైలు కోసం కేసీఆర్‌ను అడగలేదని మండిపడ్డారు. ఇక్కడి బీజేపీ నేతలు కూడా ఇదే రైలు కోసం ప్రధాని మోదీని ఎప్పుడూ కలవలేదన్నారు. పాలమూరు – రంగారెడ్డికి ఒక్క పైసా అయినా డీకే అరుణ తెచ్చారా? అని ప్రశ్నించారు. డీకే అరుణ బీఆర్ఎస్‌తో కుమ్మక్కై రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. రూ.600 ఉన్న సిలిండర్‌ను మోదీ రూ.1200కు పెంచారని ఆరోపించారు. పదేళ్ల మోదీ పాలనలో పాలమూరు ఎండిపోయిందన్నారు.

మంత్రులు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారు

ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మాత్రం వదలలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ దొరలకు, పెత్తందార్లకు టిక్కెట్ ఇవ్వలేదన్నారు. పేదలకు, బీసీ కులాల వారికి అధిక ప్రాధాన్యతను ఇచ్చామన్నారు.  ఇప్పటి వరకు 35 కోట్ల మంది ఆడపడుచులు ఉచిత బస్సుల్లో ప్రయాణించారన్నారు. వంద రోజుల్లో ఎన్నో హామీలు నెరవేర్చామని పేర్కొన్నారు. 30వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మన మంత్రులు రోజుకు 18 గంటలు పని చేస్తూ కష్టపడుతున్నారన్నారు. కేసీఆర్ వందేళ్ల నాశనం చేస్తే తాము రాత్రింబవళ్లు కష్టపడి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు బీఆర్ఎస్‌కు ఓటేశారని, ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ నేతలు వేయాలనుకుంటున్నారని ఆరోపించారు. రెండు పార్టీలు చీకటి ఒప్పందం పెట్టుకున్నాయన్నారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, జహీరాబాద్, భువనగిరి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ డమ్మీ కార్యకర్తలను పెట్టి బీజేపీకి సహకరిస్తున్నారన్నారు. తన కూతురు కవితను జైలు నుంచి విడిపించేందుకు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. మోదీ వద్ద బీఆర్ఎస్‌ను ఎందుకు తాకట్టు పెట్టారో ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఐదు నియోజకవర్గాల్లో బీజేపీకి ఓటు వేయాలని కేసీఆర్ చెబుతున్నారన్నారు.

నాపై కోపం ఉంటే నాతో కొట్లాడండి…

‘నాపై కోపం ఉంటే నాతో కొట్లాడండి… మీరు మొగోళ్లయితే మా పార్టీ కార్యకర్తలతో కొట్లాడండి’ అని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేశారు. ఎన్నికల కోడ్ వచ్చినందువల్ల తాను రైతు రుణమాఫీ చేయలేకపోయానని… అగస్ట్ లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. వచ్చేసారి పండించే వడ్లకు బోనస్ కూడా ఇస్తామన్నారు. తెలంగాణ రైతాంగం అధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు. మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలో కష్టపడ్డ వారికి టిక్కెట్లు ఇచ్చి గెలిపించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఎవరి శ్రమా ఊరికే పోదన్నారు. అందరి త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటామని పేర్కొన్నారు. ఇందిరమ్మ కమిటీలను నియమించి పేద ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. ఇవన్నీ చేయాలంటే పాలమూరు, నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని పిలుపునిచ్చారు.

Related posts

రాష్ట్ర అవతరణ దినోత్సవానికి కేసీఆర్ కు ఆహ్వనం

Ram Narayana

కమ్యూనిస్టులకు సీట్లు కేటాయింపుపై కాంగ్రెస్ మెలిక..ఒంటరి పోటీకి సిద్ధపడుతున్న సిపిఎం!

Ram Narayana

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి, అధికారం ఖాయం… సీఎల్పీ నేత భట్టి !

Ram Narayana

Leave a Comment