- దేశంలో నాలుగో విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల
- మీడియా సమావేశం నిర్వహించిన సీఈవో
- ఏపీలో మే 13న పోలింగ్
- ఆరు నియోజకవర్గాల మినహా, అన్ని చోట్లా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
- 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్
- మరో 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్
దేశంలో నాలుగో విడత ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగుతుందని, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు.
ఆరు అసెంబ్లీ స్థానాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు… పాలకొండ, కురుపాం, సాలూరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ముఖేశ్ కుమార్ మీనా వివరించారు.
రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే ముగ్గురు ఎన్నికల పర్యవేక్షకుల నియామకం జరిగిందని వెల్లడించారు. ఈ నెల 22 వరకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 85 ఏళ్లకు పైబడినవారికి, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఫారాలు ఇస్తామని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ కు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
67 వేల మంది సర్వీస్ ఓటర్లకు మాత్రమే బై పోస్ట్ ఓటింగ్ అవకాశం ఉంటుందని అన్నారు. సర్వీస్ ఓటర్లకు మే 5 నుంచి 10వ తేదీ వరకు ఓటింగ్ కు అవకాశం ఉంటుందని వివరించారు. మే 10 నాటికి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తవుతుందని ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు.
ఏపీలో పోలింగ్ విధుల కోసం 3.3 లక్షల మంది సిబ్బందిని నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి 300 కంపెనీల భద్రతా బలగాలు వస్తాయని, భద్రతా బలగాలతో కలుపుకుని మొత్తం 5.26 లక్షల మంది పోలింగ్ విధుల్లో ఉంటారని వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో రెండు కెమెరాల పర్యవేక్షణ విధానం అమలు చేస్తామని మీనా చెప్పారు.