- రాజస్థాన్‌లో మోదీ ఎన్నికల ప్రచారం
- మహిళల మంగళసూత్రాలను కాంగ్రెస్ వదలదన్న మోదీ
- ఆ పార్టీ నేతలది అర్భన్ నక్సలిజం మనస్తత్వమని విమర్శ
- ఎన్నికల సరళితో మోదీ అబద్దాలు అల్లి విద్వేషం వ్యాప్తి చేస్తున్నారన్న కాంగ్రెస్
కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే దేశ సంపద మొత్తాన్ని ముస్లింలకు పంచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని జలౌర్, భీన్మ్‌మాల్‌తో పాటు బాంస్‌వాడా ఎన్నికల ర్యాలీలో నిన్న మోదీ మాట్లాడుతూ.. ప్రజల వద్దనున్న బంగారం, సంపద మొత్తాన్ని సర్వేచేసి దానిని అందరికీ సమానంగా మళ్లీ పంచుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు. చొరబాటుదార్లకు, ఎక్కువమంది పిల్లలున్నవారికి సంపదను పంచేస్తారని, అర్బన్ నక్సలిజం మనస్తత్వం వున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరని హెచ్చరించారు.
అబద్ధాలతో విద్వేష వ్యాఖ్యలు
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందించింది. లోక్‌సభ ఎన్నికల సరళిని చూసి అసంతృప్తికి గురైన మోదీ మరిన్ని అబద్ధాలు అల్లి, విద్వేష వ్యాప్తితో ప్రజల దృష్టిని మళ్లించే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తింది. దేశ చరిత్రలో ఏ ప్రధాని దేశ ప్రతిష్ఠను ఇంతలా దిగజార్చలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆరెస్సెస్, బీజేపీ ఇచ్చే శిక్షణలో ప్రత్యేకత అని విమర్శించారు. తమ మేనిఫెస్టో ప్రతి భారతీయుడి సమానత్వం కోరుకుంటోందని స్పష్టం చేశారు. ప్రధాని తీరు చూస్తుంటే గోబెల్స్ లాంటి నియంత కుర్చీ కదులుతోందని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు.