బిజెపి విద్వేష పూరిత రాజకీయాలు… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
-మోడీ, అమిత్‌షాల పై కేసు నమోదు చేయాలి
-మత ఘర్షణతో లబ్ది పొందే యత్నం
కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు
బిజెపి విద్వేష పూరిత రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఇది అత్యంత దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. దేశ ప్రధాని వ్యాఖ్యలు దిగజారుడు తనానికి అద్దం పడుతున్నాయని ప్రధాన మంత్రి పదవి స్థాయిని మోడీ దిగజార్చారని ఆయన తెలిపారు. మంగళవారం ఖమ్మం సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ పదేళ్ల కాలంలో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదన్నారు. యేటా రెండు కోట్ల ఉద్యోగాలు, సొంత ఇండ్లు, రైతుల ఆదాయం రెట్టింపు ఇలా ఏ ఒక్క -వాగ్దానాన్ని అమలు చేయలేదని గత ఎన్నికల్లో రాముడు, రామాలయం పేరుతో లబ్ది పొందారన్నారు. కానీ ఇప్పుడు రాముడుతో ఓట్లు రాలవని ముస్లిం, హిందువుల మధ్య చిచ్చుపెట్టే అసత్య ప్రచారాలకు శ్రీకారం చుట్టారన్నారు. అందరి సంపదను -ముస్లింలకు పంచుతానని మంగళసూత్రాలు ఉండవంటూ నీచ ప్రచారానికి దిగారని గతంలో ఏ ప్రధాన మంత్రి ఇలా నీచస్థాయికి దిగజారి మాట్లాడలేదని రాజనీతిజ్ఞత లేని కనీస గౌరవం లేని ప్రధానిగా మోడీ చరిత్రలో నిలిచి పోతారన్నారు…మంగళసూత్రాన్ని గౌరవించ లేని మోడీ మంగళ సూత్రాల గురించి మాట్లాడడం సిగ్గు చేటని కూనంనేని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన 192 స్థానాల్లో బిజెపి బాగా వెనకబడి పోయిందని దీనితో హిందు, ముస్లింల మధ్య ఘర్షణ సృష్టిస్తున్నారని అదే సమయంలో విపక్ష నాయకులను వేధిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రులు కేజీవాల్, హేమంత్ సోరేల్ మాదిరి ఇప్పుడు రేవంత్రెడ్డిని సైతం ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని రేవంత్రెడ్డి పై కేసు పెడితే మోడీ, అమిత్ లపై కూడా కేసు పెట్టాలని కూనంనేని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి బిజెపి నాయకుల ప్రకటనలో కొంత వాస్తవం ఉందని ముస్లిం -రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ప్రచారం చేస్తుంది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధంగా మోడీ -మాట్లాడుతున్నారని అతనిపై కేసు నమోదు చేసిన తర్వాతే ఇతరులపై కేసులు నమోదు చేయాలని కూనంనేని సూచించారు. బిజెపి సోషల్ మీడియా విష ప్రచారం చిమ్ముతుందని ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని చొప్పించే ప్రయత్నం జరుగుతుందన్నారు. -మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేనికి నిదర్శనమన్నారు. నియంతృత్వం, నిరంకుశత్వం, స్వేచ్చలేని బిజెపి పాలన పోవాలని కాంగ్రెస్కు మద్దతునిస్తున్నామని 17 నియోజక వర్గాల్లోను బేషరతుగా మద్దతిస్తున్నామని కూనంనేని తెలిపారు. అన్ని పార్లమెంటు -నియోజక వర్గాల్లోను ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ గెలుపుకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నామని -ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్ కె జానిమియా పాల్గొన్నారు.