- ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు
- సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం పిటిషన్
- ఇరువర్గాల వాదనల పూర్తి.. సోమవారం వెలువడనున్న తీర్పు
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తికాగా.. గురువారం (నేడు) తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు గత విచారణలో తెలిపింది. అయితే, నేటి ఉదయం మరోమారు తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఈ నెల 6న (సోమవారం) తీర్పు వెలువరిస్తామని జడ్జి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత జైలుపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత.. తనను సీబీఐ అరెస్టు చేయడంపై న్యాయపోరాటం చేస్తున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మార్చి 15 న అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు కస్టడీ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు పంపించారు. జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల 11న సీబీఐ కూడా అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులపై కోర్టులో కవిత పోరాడుతున్నారు. ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
తొలుత మధ్యంతర బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో పూర్తిస్థాయి బెయిల్ కోసం కవిత మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ, సీబీఐ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని కోర్టును అభ్యర్థించారు. అటు కవిత తరఫున వాదనలు కూడా విన్న న్యాయస్థానం.. నేడు (గురువారం) తీర్పు వెలువరిస్తుందని భావించగా మరోసారి వాయిదా వేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అని బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.