- శంషాబాద్ విమానాశ్రయంలో ఘటన
- ఎయిర్‌లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే వదిలేసి వెళ్లిన ఆ సంస్థ ఫ్లైట్స్
- కొందరు ప్రయాణికులు తమ ఇబ్బందులను వీడియో తీసి నెట్టింట పెట్టడంతో దిగొచ్చిన ఎయిర్‌లైన్స్ యాజమాన్యం
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన ఫ్లైట్స్ ఎయిర్‌పోర్టులోనే వదిలేసి వెళ్లిపోయాయి. కొందరు ప్రయాణికులు దేశీయ విమాన సర్వీసుల్లో ప్రధాన నగరాలకు వెళ్లేందుకు ఓ విమానయాన సంస్థలో టికెట్లు కొనుగోలు చేశారు.
వారిలో కొందరు ఎయిర్‌పోర్టుకు చేరుకుని వెబ్ చెక్ఇన్‌కి ప్రయత్నించారు. కానీ, సర్వర్ పని చేయలేదు. టికెట్స్ చేతుల్లో ఉన్నప్పటికీ ప్రయాణికుల జాబితాలో వారి పేర్లు లేవని సిబ్బంది లోపల గేటు వద్ద వారిని అనుమతించలేదు. దాంతో కొందరు ప్రయాణికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
దాంతో దిగొచ్చిన విమానయాన సంస్థ యాజమాన్యం తమ వేరే సర్వీసుల్లో గమ్యస్థానాలకు పంపిస్తామని హామీ ఇచ్చింది. ఇక ఇదే విషయమై ఎయిర్‌పోర్టు అధికారులను అడిగితే సమస్య తమ దృష్టికి రాలేదని చెప్పారు. అలాగే సర్వర్‌ను పునరుద్ధరించుకునే బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే అని తెలిపారు.