రాజకీయ నాయకుడితో ఆర్మీ జవాన్ బేరసారాలు
- మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఘటన
- జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ ఆర్మీబేస్‌లో పనిచేస్తున్న నిందితుడు మారుతి ధక్నే
- శివసేన (యూబీటీ) నేతను కలిసి బేరాలు
- పక్కా ప్లాన్‌తో నిందితుడిని పట్టించిన నేత
తనకు రూ. 2.5 కోట్లు ఇస్తే ఈవీఎం చిప్‌ను మార్చేసి చెప్పిన అభ్యర్థిని గెలిపిస్తానంటూ ఓ రాజకీయ నాయకుడిని బురిడీ కొట్టించే ప్రయత్నం చేసిన ఆర్మీ జవాను కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మారుతి ధక్నే సైన్యంలో పనిచేస్తున్నాడు. మారుతి ఇటీవల శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ దన్వే (శివసేన-యూబీటీ)ను కలిశాడు. ఎంచుకున్న అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడేలా చిప్‌ను ఉపయోగించి ఈవీఎంను మారుస్తానని, అందుకు రూ. 2.5 కోట్లు అవుతాయని డిమాండ్ చేశాడు.
అనుమానించిన అంబాదాస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడు తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో పట్టించేందుకు ప్లాన్ చేశాడు. మంగళవారం సాయంత్రం అంబాదాస్ సోదరుడు రాజేంద్ర.. నిందితుడిని ఓ హోటల్‌కు పిలిపించాడు. అక్కడ రూ. 1.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు నమ్మించి అడ్వాన్స్ కింద లక్ష రూపాయలు ముట్టజెప్పారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుడు మారుతికి పెద్ద మొత్తంలో అప్పులున్నాయని, వాటిని ఇలా అడ్డదారుల్లో తీర్చాలని భావించాడని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన మారుతి ధక్నే జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ ప్రాంతంలో ఆర్మీబేస్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.