- తెనాలిలో పోలింగ్ బూత్ వద్ద ఘటన
- నేరుగా బూత్ లోకి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
- క్యూలైన్ లో రావాలని ఎమ్మెల్యేని కోరిన గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి
- సుధాకర్ చెంపచెళ్లుమనిపించిన ఎమ్మెల్యే… తిరిగి ఎమ్మెల్యేని కొట్టిన సుధాకర్
- తనను అసభ్యంగా తిట్టాడంటూ ఓ వీడియోలో వెల్లడించిన తెనాలి ఎమ్మెల్యే
తెనాలిలో ఇవాళ పోలింగ్ బూత్ వద్ద ఓ ఓటరుకు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మధ్య చెంపదెబ్బల వ్యవహారం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పోలింగ్ బూత్ లోకి నేరుగా వెళ్లేందుకు ఎమ్మెల్యే శివకుమార్ ప్రయత్నించగా, గొట్టిముక్కల సుధాకర్ అనే ఓటరు అభ్యంతరం చెప్పారు. దాంతో ఎమ్మెల్యే ఆ ఓటరును చెంపదెబ్బ కొట్టగా, ఆ ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యేని చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వివరణ ఇచ్చారు.
“ఇవాళ ఉదయం తెనాలి పట్టణంలోని ఐతా నగర్ పోలింగ్ స్టేషన్లో నేను, నా భార్య ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లాం. అక్కడ క్యూ చాలా పెద్దదిగా ఉంది. అయితే, నా సామాజిక వర్గానికి చెందిన గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి… “ఇడుగో వచ్చాడయ్యా, మాల మాదిగ వర్గాలకు కొమ్ముకాసే ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి” అంటూ నాపైనా, వైసీపీపైనా ద్వేషంతో మాట్లాడాడు. వైసీపీ… మాల, మాదిగ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పార్టీ అనే అక్కసుతో, శాడిజంతో మాట్లాడాడు.
అతడిది ఐతా నగరే… ఉండేది బెంగళూరు. నేను కూడా కమ్మవాడ్నే, అతడు కూడా కమ్మవాడే. టీడీపీ, జనసేన వాళ్లు కావాలనే ఎక్కడెక్కడో ఉండేవాళ్లని, అమెరికాలో ఉండేవాళ్లను కూడా తీసుకువచ్చి ఓట్లు వేయించే ప్రయత్నంలో ఇలా శాడిజంతో వ్యవహరిస్తున్నారు.
ఇవాళ అతడు మద్యం తాగి ఉన్నాడు. నేను, నా భార్య ఓటేయడానికి వెళుతుంటే, ఎమ్మెల్యే అయితే ఏంటంట? క్యూలో రావాలి అంటూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా ఓటేసి వచ్చారు…. ఆయనేమైనా క్యూలో నిల్చుని ఓటేసి వచ్చారా? సహజంగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు నేరుగా వెళ్లి ఓటేయడం అనేది ఆనవాయతీ.
కానీ నా భార్య పక్కన ఉండగా అతడు అసభ్యంగా దూషించాడు. మరీ ముఖ్యంగా, చిన్న కులాలను బహిరంగంగా తిట్టాడు. మాల మాదిగలకు అండగా ఉండే పార్టీ… ఈ లం*కొడుకు అసలు కమ్మోడేనా? అని మాట్లాడాడు. అక్కడ ఓటర్లలో చాలామంది కమ్మవాళ్లు, ఎస్సీలు ఉన్నారు. అతడు అన్న మాటలను అక్కడి ఓటర్లందరూ విన్నారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటూ నేను చేయిచేసుకున్నది నిజమే.
కానీ అతడు అన్న మాటలను ప్రస్తావించకుండా ఏబీఎన్, టీవీ5, సోషల్ మీడియాల్లో దీన్ని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే ప్రజలకు స్పష్టత ఇవ్వడం కోసమే ఈ వివరణ ఇస్తున్నా. ఇలాంటి చర్యల వల్లే ప్రజలందరూ కమ్మ కులాన్ని ద్వేషిస్తున్నారు” అంటూ అన్నాబత్తుని శివకుమార్ వీడియో సందేశం వెలువరించారు.
తెనాలి ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టడంపై ఓటరు సుధాకర్ వివరణ

“నేను ఇవాళ ఉదయం 7.05 గంటలకు ఓటేసేందుకు పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడ్డాను. ఆ సమయంలో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి ఓటేసేందుకు వచ్చారు. క్యూలో నిలబడి లోపలికి వెళ్లాలని నేను ఎమ్మెల్యే పక్కన ఉన్న వ్యక్తులకు చెప్పాను. వారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.
నేను క్యూలైన్లో రమ్మని చెప్పడంతో ఎమ్మెల్యే వాళ్లకు కోపం వచ్చింది. ఓటేసి బయటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కుమారుడు దురుసుగా మాట్లాడాడు. తన అనుచరులతో మాట్లాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నా వద్దకు వచ్చి ఎవడ్రా నువ్వు? అంటూ నన్ను కొట్టాడు.
కొట్టాలని నేనేమీ ప్లాన్ తో రాలేదు. అప్పటికప్పుడు కలిగిన ఆవేశంతో ఎమ్మెల్యేను తిరిగి కొట్టాను. దాంతో ఏడెనిమిది మంది వ్యక్తులు నన్ను కిందపడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. వాళ్లెవరో తెలియదు కానీ, చూస్తే గుర్తుపడతాను.
నేను మద్యం తాగి ఉన్నానని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదు. నేను మద్యం తాగి ఐదారునెలలైంది. ఇవాళ నేను మద్యం తాగి ఉంటే నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షించుకోవచ్చు.
అంతేకాదు, నేను అసభ్యంగా దూషించినట్టు చెబుతున్నారు… కావాలంటే పోలింగ్ బూత్ లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని చూసుకోవచ్చు. నేను ఎవరినీ ఒక్క మాట కూడా దూషించలేదు. క్యూలైన్లో నిలబడి ఓటేయండి అని మాత్రమే అన్నాను.
నేను ఒక సామాన్య పౌరుడ్ని. మాకు రక్షణ కల్పించాల్సిన ఎమ్మెల్యేనే “చంపుతాం” అని బెదిరించడం పద్ధతి కాదు” అని సుధాకర్ పేర్కొన్నారు.