Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంఆరోగ్యం

సింగపూర్‌లో మరో కరోనా ఉపద్రవం!

  • మే 5 – 11 మధ్య 25,900 కొత్త కేసులు నమోదు
  • అంతకుముందు వారంతో పోలిస్తే గణనీయంగాపెరిగిన కేసుల సంఖ్య
  • మరో నాలుగు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరొచ్చన్న ఆరోగ్య శాఖ మంత్రి
  • తగినన్ని ఆసుపత్రి బెడ్స్ అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
  • బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రజలకు సూచన

సింగపూర్‌లో మరో కరోనా ఉపద్రవం మొదలైంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్తగా 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. ‘‘మనం మరో కొవిడ్ వేవ్ ప్రారంభంలో ఉన్నాం. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు. 

ప్రభుత్వ లెక్కల ప్రకారం, కొవిడ్ కారణంగా రోజూ ఆసుపత్రి పాలవుతున్న వారి సగటు సంఖ్య 250కి పెరిగింది. అంతుకుమునుపు వారంలో ఇది 181గా ఉంది. ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది. మరోవైపు, అవసరమైన సందర్బాల్లో ఆసుపత్రి బెడ్లు అందుబాటులో ఉండేలా అక్కడి అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. అవకాశం ఉన్న సందర్భాల్లో ఆపరేషన్లను వాయిదా వేస్తున్నారు. మొబైల్ ఇన్‌పేషెంట్ కేర్ ద్వారా అనేక మందికి ఇళ్లల్లోనే చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ బారిన పడే అవకాశం అధికంగా ఉన్న వృద్ధులు, ఇతరులు, అదనపు కొవిడ్ టీకా తీసుకోవాలని సింగపూర్ మంత్రి సూచించారు. 

గతంలో 12 నెలల్లో టీకా తీసుకోకపోతే మరో డోసు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య రెట్టింపైతే పేషెంట్ల సంఖ్య 500 లకు చేరుకుంటుందని ఆయన అన్నారు. ఈ పరిస్థితి తట్టుకునే సామర్థ్యం సింగపూర్ వ్యవస్థలకు ఉందని చెప్పారు. అయితే, ఆ తరువాత కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపైతే మాత్రం ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందని హెచ్చరించారు. ప్రస్తుతానికి తాము ఎటువంటి సామాజిక ఆంక్షలు విధించలేదని తెలిపారు. గత్యంతరం లేకపోతేనే ఆంక్షలు విధిస్తామని పేర్కొన్నారు. 

రవాణా, సమాచార కేంద్రంగా ఉన్న సింగపూర్‌లో అన్ని దేశాలకంటే ముందుగా కరోనా వేవ్ మొదలవుతుందని మంత్రి తెలిపారు. దేశంలో కరోనా ఎండ్‌మిక్‌గా మారడంతో ఏటా ఒకటో రెండో వేవ్స్ రావడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జేఎన్.1, దాని ఉపజాతులైన కేపీ.1, కేపీ.2లు ప్రబలంగా ఉన్నాయి. సింగపూర్‌లో  కేపీ.1, కేపీ.2 వేరియంట్ల కారణంగానే అధికశాతం కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వేరియంట్లు వేగంగా వ్యాపించడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కేపీ.2 వేరియంట్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే పేర్కొంది.

Related posts

సాయం కోసం పోలీసులకు ఫోన్ చేస్తే.. వచ్చి కాల్చి చంపారు

Ram Narayana

చంద్రుడిపై రైళ్లు.. నాసా ప్రణాళికలు రెడీ…

Ram Narayana

కాంగోలో అంతుచిక్కని వ్యాధితో 143 మంది మృతి

Ram Narayana

Leave a Comment