తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం … 5 నుంచి భారీగా బదిలీలు!
11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన చేయాలనే యోచన
తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా.. ఎస్సై నుంచి ఐపీఎస్ వరకు..
సిద్ధమవుతున్న బదిలీల చిట్టా…
ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందుకోసం పాలనాయంత్రాంగంలో తహసీల్దార్ మొదలు సీనియర్ ఐఏఎస్ అధికారి దాకా.. ఎస్సై నుంచి ఐపీఎస్ వరకు అన్ని స్థాయుల్లో భారీ బదిలీలకు కసరత్తు జరుగుతోందా? ఈ ప్రశ్నలకు అత్యంత విశ్వసనీయవర్గాలు ఔననే చెబుతున్నాయి.
జూన్ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ పూర్తవ్వగానే కోడ్ ముగుస్తుంది. జూన్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో భారీ ప్రక్షాళన ఉంటుందని.. వరుసగా బదిలీల ఉత్తర్వులు వెలువడతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలో.. ఆర్థిక, రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యం, పురపాలక – పట్టణాభివృద్ధి, వ్యవసాయం, విద్యుత్తు, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు, రవాణా.. ఇలా అన్ని శాఖల్లో బదిలీలు చేపట్టేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది.*
ఈ క్రమంలో ఒకరిద్దరు కీలక ఐఏఎస్ అధికారులను, పెద్ద సంఖ్యలో ఐపీఎస్ లను బదిలీ చేయనున్నట్లు సమాచారం.
పోలీసు శాఖలో ఎస్సై నుంచి ఎస్పీల దాకా.. రెవెన్యూ శాఖలో తహసీల్దార్ మొదలు.. ఆర్‌డీవో, డీఆర్‌వో, కలెక్టర్ వరకూ బదిలీలు ఉంటాయని స్పష్టమవుతోంది. అటు.. పంచాయతీరాజ్ శాఖలో ఎక్స్‌టెన్షన్ అధికారులతోపాటు.. డివిజనల్ పంచాయతీ ఆఫీసర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు(డీపీవో), జిల్లా పరిషత్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది. మరోవైపు..స్టాంపులు –
రిజిస్ట్రేషన్ల శాఖలో కొంత మంది సబ్-రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలను బదిలీ చేయనుంది. ఈ శాఖలో 2023 ఆగస్టులో భారీస్థాయిలో బదిలీ జరిగాయి. కొంత మంది సబ్-రిజిస్ట్రార్లు, కింది స్థాయిలో అధికారుల బదిలీలు జరగలేదు. వీరి వల్ల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు చెడ్డ పేరు వస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇలాంటివారిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని సమాచారం. వీటితోపాటు.. ఇంటెలిజెన్స్ నివేదికలు, ఉద్యోగ సంఘాల నేతలతో అంతర్గత చర్చలు జరిగిన సమయంలో సేకరించిన వివరాలను తాజా బదిలీల్లో పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నట్లు సచివాలయ వర్గాల చెబుతున్నాయి.