Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

ఎన్ఎస్ యూఐ జాతీయ కార్యదర్శి సంపత్ దారుణహత్య …?

కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ జాతీయ కార్యదర్శి బి.సంపత్ కుమార్ ఏపీలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇది హత్య అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సమీపంలోని ఓ చెరువు వద్ద పొదల్లో సంపత్ కుమార్ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పారేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంపత్ మృతదేహాన్ని తీసుకువచ్చినట్టుగా భావిస్తున్న వాహనాన్ని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

సంపత్ కుమార్ స్వస్థలం ధర్మవరం మండలం యర్రగుంట్లపల్లె. హిందూపురంలో న్యాయవాదిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన సంపత్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జాతీయ కార్యదర్శిగా, ఎన్ఎస్ యూఐ కేరళ ఇన్చార్జిగానూ వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ సంపత్ కుమార్ చురుగ్గా పాల్గొన్నారు.

సంపత్ కుమార్ మృతితో కాంగ్రెస్ పార్టీలో విషాదం అలముకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ కోరుతోంది.

కాగా, సంపత్ కుమార్ మృతిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఎన్ఎస్ యూఐ జాతీయ కార్యదర్శి సంపత్ కుమార్ అనుమానాస్పద మరణం తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు.

ఎంతో అద్భుతమైన రాజకీయ భవిత, నాయకుడిగా ఎదిగే లక్షణాలు, పోరాట పటిమ ఉన్న సంపత్ మృతి వెనుక కారణాలు, నిజాలను పోలీసులు మరింత లోతుల్లోకి వెళ్లి విచారించాలని కోరుతున్నట్టు షర్మిల తెలిపారు. సంపత్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ షర్మిల ట్వీట్ చేశారు.

Related posts

నిరసనలు ఏపీలో చేసుకోవాలన్న కేటీఆర్… హైదరాబాదులో కూడా తెలుగువాళ్లు ఉన్నారంటూ లోకేశ్ కౌంటర్!

Ram Narayana

డిప్యూటీ సీఎంకు రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు…

Ram Narayana

 వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి సూర్యాపేట జిల్లాలో ప్రమాదం!

Ram Narayana

Leave a Comment