- పోర్చుగల్ ఎయిర్ షోలో విషాదం
- గాల్లో ఆరు విమానాలు కలిసి విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం
- ప్రమాదంపై దర్యాప్తు చేపడతామన్న పోర్చుగల్ రక్షణ మంత్రి
యూరోపియన్ దేశమైన పోర్చుగల్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ షోలో భాగంగా గాల్లో విన్యాసాలు చేసే క్రమంలో రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక విమానంలోని పైలట్ మృతిచెందగా మరో విమానంలోని పైలట్ గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
పోర్చుగల్ దక్షిణ ప్రాంతంలోని బెజా ఎయిర్ పోర్ట్ లో శనివారం సుమారు 30 ఏరోబాటిక్ బృందాలతో ఎయిర్ షో ప్రారంభమైంది. ఆదివారం షో సందర్భంగా యాక్ స్టార్స్ అనే ఏరోబాటిక్ గ్రూప్ లోని విమానాలు విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విమానాలు యకోవ్ లెవ్ యాక్–52 రకానికి చెందినవి.
ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఒకరు తీసిన ఆ వీడియోలో తొలుత ఆరు విమానాలు ఒకేసారి గాల్లోకి చేరాయి. వాటిలో ఒక విమానం మిగతా వాటికన్నా కాస్త కింద నుంచి ఎగురుతుండగా మిగిలిన ఐదు విమానాలు ఒకే ఎత్తులో పక్కపక్కనే ఎగురుతున్నాయి. ఈ క్రమంలో కింద వైపు ప్రయాణిస్తున్న విమానం మిగిలిన ఐదు విమానాలను క్రాస్ చేసి వెళ్లే క్రమంలో ఒకదాన్ని ఢీకొంది. దీంతో ఆ రెండు విమానాలు కిందకు పడిపోవడం వీడియోలో కనిపించింది. ఒక విమానం ఎయిర్ పోర్ట్ వెలుపల పడి ఒక్కసారిగా మంటలు రావడం వీడియోలో కనిపించింది. మరో విమానం ఎయిర్ పోర్ట్ టార్మాక్ పై ల్యాండ్ కాగలిగింది.
ఈ దుర్ఘటనలో మంటల్లో కాలిపోయిన విమానంలోని పైలట్ మృతిచెందాడు. అతను స్పెయిన్ జాతీయుడిగా పోర్చుగల్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. గాయపడ్డ మరో పైలట్ పోర్చుగల్ జాతీయుడిని తెలిపింది. అతనికి అత్యవసర చికిత్స అందించి వెంటనే బెజా ఆసుపత్రికి తరలించినట్లు వివరించింది. మృతుని కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలియజేసినట్లు పేర్కొంది.
మరోవైపు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడతామని పోర్చుగల్ రక్షణ మంత్రి నునో మెలో తెలిపారు. ప్రమాదానికిగల సరైన కారణం ఏమిటో అప్పుడే తెలుస్తుందన్నారు. పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో మాట్లాడుతూ సరదాగా, సంతోషంగా సాగాల్సిన సమయం కాస్తా విషాదాంతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ షోను నిర్వాహకులు సస్పెండ్ చేశారు.